- లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగిస్తే ఎవరినైనా వదలం: సీపీ సుధీర్ బాబు
- మంచు ఫ్యామిలీపై మూడు కేసులు రిజిస్టర్ చేసినం
- సెలబ్రెటీని బైండోవర్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అని వెల్లడి
హైదరాబాద్/వికారాబాద్, వెలుగు: జర్నలిస్ట్‌పై దాడి ఘటనలో సినీ నటుడు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని రాచకొండ సీపీ సుధీర్ బాబు ప్రకటించారు. లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగించే వాళ్లు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోహన్ బాబు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కేసులో మంచు విష్ణు, మంచు మనోజ్‌ను విచారించినట్లు చెప్పారు.
ఈ మేరకు మనోజ్‌ను లక్ష రూపాయల పర్సనల్ బాండ్‌తో బైండోవర్ చేశామన్నారు. సెలబ్రెటీని బైండోవర్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అని తెలిపారు. ఈ మేరకు గురువారం సీపీ సుధీర్ బాబు మీడియాతో మాట్లాడారు. ‘‘మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు రిజిస్టర్ చేసినం. ఒకరిపై ఒకరు ఇచ్చిన ఫిర్యాదులు సహా మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. మనోజ్‌పై మోహన్ బాబు ఫిర్యాదుతో పాటు మీడియాపై ఆయన దాడి చేసిన కేసులను దర్యాప్తు చేస్తున్నం. మంచు మనోజ్ ఫిర్యాదు మేరకు ఇప్పటికే మోహన్‌బాబు మేనేజర్ కిరణ్‌ను అరెస్ట్ చేసినం’’అని సీపీ సుధీర్ బాబు తెలిపారు. కాగా, మంగళవారంఅస్వస్థతకు గురైన మోహన్ బాబు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
మోహన్‌బాబుపై చర్యలు తీసుకోండి
జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘం లీడర్లు మాట్లాడారు. మోహన్ బాబుపై చర్యలు తీసుకోకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామన్నారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీధర్, సీనియర్ జర్నలిస్టులు ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎం.వైద్యనాథ్, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు ఆర్ఎం.గిరీశ్ స్వామి, జిల్లా కోశాధికారి కే.రాఘవేందర్, నాయకులు అశోక్, రాజు పాల్గొన్నారు.
గేటు పగులగొట్టి ఇంట్లోకి రావొచ్చా: మోహన్ బాబు
హాస్పిటిల్ నుంచి డిశ్చార్జ్ అయిన మోహన్ బాబు బుధవారం ఓ ఆడియోను విడుదల చేశారు. కుటుంబ సమస్యల్లో బయట వాళ్లు జోక్యం చేసుకోవచ్చా అని అందులో ప్రశ్నించారు. ‘‘పత్రికా సోదరులు నా ఇంటి ముందు నాలుగు రోజుల నుంచి వ్యాన్లు పెట్టుకుని ఉండటం ఎంత వరకు న్యాయం? నేను అప్పటికి బయటకు వెళ్తున్నప్పుడు చెప్పాను. నాకు కుటుంబ సమస్యను నేనే పరిష్కరించుకుంటాను.
దయచేసి నన్ను గౌరవించండి అని కోరా. రాత్రి సమయంలో మా ఇంటి గేటు పగులగొట్టి ఎవరైనా ఇంట్లోకి రావొచ్చా? అయితే వాళ్లను తిట్టాలని కొట్టాలని నేను అనుకోలేదు. అతనిని కొట్టాననే చెబుతున్నారు తప్ప.. ఆయన నా ముఖంపై మైకు పెట్టడం వలన నా కన్ను పోవాల్సింది. కంటి కింద తగిలింది లేదంటే నా జీవితం గుడ్డిది అయ్యేది. అతనికి చెవికి తగిలిందని అంటున్నారు. ఆ చీకట్లో ఏం జరిగిందో తెలియలేదు.
ఘర్షణ జరిగిన మాట వాస్తవమే. నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలి ఉండవచ్చు. దానికి నేను బాధపడుతున్నా. వారు గేటు బయట ఉండి.. నేనే ఆవేశంలో వెళ్లి కొట్టి ఉంటే వంద కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయొచ్చు. అలా కొట్టి ఉంటే నేనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయేవాడ్ని. కానీ నా ఇంటి గేటు తోసుకు వచ్చి నాకు మనశ్శాంతి లేకుండా చేశారు’’అని పేర్కొన్నారు. దీనిపై ప్రజలతో పాటు న్యాయాధిపతులు, ప్రజా ప్రతినిధులు, అభిమానులు, మీడియా ప్రతినిధులు కూడా ఆలోచించుకోవాలన్నారు.