
- ఈ నెల 20న వరంగల్‌లో డాక్టర్ సుమంత్‌రెడ్డిపై హత్యాయత్నం
- అతడి భార్య, ఆమె ప్రియుడితో పాటు కానిస్టేబుల్ అరెస్ట్
వరంగల్/కరీమాబాద్, వెలుగు : వరంగల్ నగరంలో ఈ నెల 20న డాక్టర్‌పై జరిగిన హత్యాయత్నం కేసు మిస్టరీ వీడింది. డాక్టర్ భార్యే ప్రియుడితో కలిసి హత్యకు ప్లాన్ చేసిందని, ఇందుకు ఓ ఏఆర్ కానిస్టేబుల్ సైతం సహకరించాడని గుర్తించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ నందిరాంనాయక్ గురువారం వెల్లడించారు. వరంగల్‌లోని హంటర్ రోడ్డుకు చెందిన డాక్టర్ గాదె సుమంత్‌రెడ్డి, షిర్డి సాయినగర్‌కు చెందిన ఫ్లోరా మరియా 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు.
సంగారెడ్డి జిల్లాలో కాంట్రాక్ట్ పద్ధతిలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగం రావడంతో సుమంత్‌రెడ్డి తన భార్యతో కలిసి 2018లో సంగారెడ్డికి వెళ్లాడు. ఫ్లోరా అక్కడి ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసేది. ఈ క్రమంలో ఫ్లోరాకు జిమ్ కోచ్‌గా పనిచేసే ఎర్రోళ్ల శామ్యూల్ ఫిన్నీతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం సుమంత్‌రెడ్డికి తెలియడంతో భార్యను మందలించాడు. ఫ్లోరాకు డిగ్రీ కాలేజీ లెక్చరర్‍గా ఉద్యోగం రావడంతో వరంగల్‌కు వచ్చి హంటర్‍రోడ్‌లోని వాసవీ కాలనీలో ఉంటున్నారు.
సుమంత్‌రెడ్డి కాజీపేటలో హాస్పిటల్ పెట్టుకున్నాడు. ఇదిలా ఉండగా శామ్యూల్ అప్పుడప్పుడు వరంగల్ వచ్చి ఫ్లోరాను కలిసేవాడు. విషయం తెలుసుకున్న సుమంత్‌రెడ్డి భార్యను మరోసారి మందలించాడు. దీంతో శామ్యూల్‌తో కలిసి ఉండాలంటే తన భర్తను హత్య చేయాలని నిర్ణయించుకున్న ఫ్లోరా ఇదే విషయాన్ని ప్రియుడికి చెప్పింది.
తన భర్తను చంపేస్తే ఇల్లు కట్టిస్తానని హామీ
సుమంత్‌రెడ్డిని చంపాలని నిర్ణయించుకున్న ఫ్లోరా ఖర్చుల కోసమంటూ రూ. లక్ష శామ్యుల్‍కు ఇచ్చింది. అతడు తన స్నేహితుడైన, సంగారెడ్డికె చెందిన ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ మంచుకూరి రాజ్‌కుమార్‌కు విషయం చెప్పాడు. మర్డర్‌కు సహకరిస్తే సంగారెడ్డిలో ఇల్లు కట్టిస్తామని అతడికి హామీ ఇచ్చారు. తర్వాత ఫ్లోరా ఇచ్చిన రూ.లక్షలో రూ.50 వేలు రాజ్‌కుమార్‌కు ఇవ్వడంతో పాటు ఇనుపసుత్తి, ఇతర సామగ్రి కొనుగోలు చేశారు.
తర్వాత ప్లాన్‌లో భాగంగా శామ్యూల్, రాజ్‌కుమార్ కలిసి బైక్‌పై కాజీపేటకు వచ్చారు. సుమంత్ హాస్పిటల్‌లో పని ముగించుకొని కారులో ఇంటికి బయలుదేరాడు. ఉర్సు కరీమాబాద్ బైపాస్‌రోడ్డులోని భట్టుపల్లి వద్దకు రాగానే సుత్తితో కారును వెనుక భాగంలో కొట్టారు. దీంతో సుమంత్ పక్కకు ఆపి కారును పరిశీలిస్తుండగా శామ్యూల్, రాజ్‌కుమార్ వచ్చి సుత్తి, రాడ్లతో దాడి చేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన సుమంత్‌ను పోలీసులు హాస్పిటల్‌కు తరలించారు.
కేసు నమోదు చేసిన మిల్స్ కాలనీ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులను పట్టుకున్న సీఐ వెంకటరత్నం, టాస్క్‌ఫోర్స్ సీఐ రంజిత్‌కుమార్, ఎస్సై సురేశ్, కానిస్టేబుళ్లు బావ్‌సింగ్, చంద్రశేఖర్, వెంకన్న, రాజు, జలంధర్, ఎండీ.గౌస్, ఏఏవో సల్మాన్, ఐటీ కోర్ టీం పీసీ నగేశ్‌ను ఉన్నతాధికారులు అభినందించారు