- పట్టుకొని కొట్టి పోలీసులకు అప్పగించిన భక్తులు
కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయంలోని గంగిరేగుచెట్టు ప్రాంగణంలో హుండీలను ధ్వంసం చేసి నగదు చోరీ చేస్తున్న దొంగలను భక్తులు పట్టుకున్నారు. ఒడిశాకు చెందిన విప్లవ్ కొన్నేండ్ల కింద కొండపాకలో స్థిరపడ్డాడు. ఇతడికి అదే గ్రామానికి చెందిన రాజీవ్ తో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం రాజీవ్ కొమురవెల్లి శివారులోని స్వాగత తోరణం వద్ద చిన్న దుకాణం నడుపుతున్నాడు. మల్లన్న ఆలయంలో జాతర సాగుతున్న నేపథ్యంలో హుండీలో డబ్బులు కొట్టేయాలన్న ఆలోచనతో ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు గంగిరేగుచెట్టు ప్రాంగణానికి చేరుకున్నారు. సీసీ కెమెరాను పక్కకు తిప్పి హుండీలను పగలగొట్టి అందులోని నగదును గోనె సంచిలో నింపుతున్నారు. అప్పుడప్పుడే గంగిరేగు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వచ్చిన భక్తులు దీన్ని చూసి ప్రశ్నించారు. తాము ఎండోమెంట్ డిపార్ట్మెంట్వాళ్లమని చెప్పగా, దేవాదాయ శాఖ అయితే హుండీలు పగలగొట్టమేమిటని కొట్టి పోలీసులకు అప్పజెప్పారు. దీంతో ఈవో బాలాజీశర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇద్దరి నుంచి రూ.11వేలు స్వాధీనం చేసుకుని సీజ్ చేసి రిమాండ్ కు పంపించామని ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. విప్లవ్ పదేండ్ల కింద మల్లన్న ఆలయ తలనీలాల కాంట్రాక్టర్ వద్ద గుమాస్తాగా పనిచేశాడు. అప్పుడు తలనీలాలను అపహరించి దొంగచాటుగా అమ్ముకుని పట్టుబడటంతో వెళ్లగొట్టారు. మళ్లీ ఇప్పుడు ఏకంగా హుండీలు పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు.