బెల్లంపల్లి రూరల్, వెలుగు : నెన్నెల మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో శనివారం అర్థరాత్రి మరోసారి దుండగుడు చోరీకి యత్నించారు. నెల రోజుల క్రితం ఇదే బ్యాంకులో చోరీకి యత్నించిన సంగతి తెలిసిందే. ఎస్సై శ్యాంపటేల్ తెలిపిన వివరాల ప్రకారం.. దుండగుడు బ్యాంకు వెనుకాల కిటికీని కట్టింగ్ప్లేయర్, ఉలి సాయంతో తొలగించి లోనికి ప్రవేశించాడు. సీసీ కెమెరా కనెక్షన్ తొలగించి స్ట్రాంగ్ రూమ్ డోర్‌ను గడ్డపారతో తెరిచేందుకు ప్రయత్నించగా సైరన్ మోగింది. దీంతో సిమ్‌కార్డు లేని చిన్న సెల్‌ఫోన్, కట్టింగ్ ప్లేయర్, ఉల్లి, గడ్డపార, కర్చిఫ్‌ను అక్కడే వదిలి దుండగుడు పారిపోయాడు. సైరన్విని సమీపంలోని పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
బ్యాంకులో నగదు, బంగారం ఏది పోలేదని గుర్తించారు. నెల రోజుల కింద ఇదే బ్యాంకులో చోరీకి విఫలయత్నం చేసి ‘గుడ్ బ్యాంకు.. ఒక్క రూపాయి కూడా దొరకలేదు’ అని కితాబ్ ఇచ్చిన దొంగే మళ్లీ చోరీకి యత్నించినట్లు పోలీసులు, బ్యాంకు సిబ్బంది భావిస్తున్నారు. ఆదివారం పోలీసులు, డాగ్‌స్వ్కాడ్, క్లూజ్ టీమ్‌లతో ఘటన స్థలాన్ని పరిశీలించి తనిఖీచేశారు. బ్యాంకు మేనేజర్ వెంకటేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.