ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఆప్ ధర్నా

ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఆప్ ధర్నా
  • షాహీన్‌ బాగ్‌ లో అక్రమ కట్టడాల కూల్చివేతల
  • కూల్చివేతలను అడ్డుకున్న స్థానికులు, కాంగ్రెస్, ఆప్ నేతలు
  • స్థానికుల నిరసనలతో షాహీన్‌ బాగ్‌ లో ఉద్రిక్తత 
  • బుల్డోజర్లు, జేసీబీలను వెనక్కి పంపిన సౌత్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు
  • ఆందోళనలో పాల్గొన్న ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ 

ఢిల్లీ : ఢిల్లీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు బుల్డోజర్లు మళ్లీ రంగంలోకి దిగాయి. షాహీన్‌ బాగ్‌ ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేతలకు సౌత్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు చర్యలు చేపట్టారు. షాహీన్‌బాగ్‌ ప్రాంతంలోని అక్రమ కట్టడాలను బుల్డోజర్లు, జేసీబీలతో కూల్చివేసేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో షాహిన్‌ బాగ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

స్థానికులతో పాటు కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కూల్చివేతలను అడ్డుకున్నారు. బుల్డోజర్లను అడ్డుకుని, రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. కొంతమంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో కూల్చివేతల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు.  

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓఖ్లా ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఆందోళనలో పాల్గొన్నారు. షాహీన్‌బాగ్‌ ప్రాంతంలో అక్రమ కట్టడాలను ఇప్పటికే తొలగించామని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకే బుల్డోజర్లతో కూల్చివేతలకు ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీపై మండిపడ్డారు.

కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని జ‌హంగిర్‌పురిలోనూ అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చివేతకు ఉత్తర ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు చర్యలు చేపట్టారు. దీనిపై స్థానికులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా..నిర్మాణాల కూల్చివేతను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

కట్టడాల కూల్చివేతలపై స్టే ఇవ్వాలంటూ సుప్రీంలో పిటిషన్

సీపీఎం పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

షాహీన్ బాగ్ లో అక్రమ కట్టడాల కూల్చివేతలపై స్టే ఇవ్వాలంటూ సీపీఎం దాఖలు చేసిన అత్యవసర పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కూల్చివేతల అంశంపై తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ అంశాన్ని ఢిల్లీ హైకోర్టులోనే తేల్చుకోవడం మేలని పిటిషనర్లకు సూచించింది. పిటిషన్ ను బాధితులు కాకుండా ఒక రాజకీయ పార్టీ వేయడమేంటని..? సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయాలకు అత్యున్నత న్యాయస్థానాన్ని వేదికగా చేసుకోవద్దని తీవ్రంగా మందలించింది. సీపీఎం వేసిన పిటిషన్ ను తిరస్కరించింది.

 

మరిన్ని వార్తల కోసం..

ఉపాధి పనులకు బొట్టుపెట్టి పిలుస్తున్నరు

భారీ నష్టాల్లో దేశీ సూచీలు