అట్టుక్కల్ సంబురం ఆరంభం
కేరళలో కరోనా వైరస్ కేసులున్నా అక్కడి జనాలు భయపడడం లేదు. కేరళలో ఏటా జరిగే ఒక సంబురానికి ప్రభుత్వంకూడా అనుమతినిచ్చింది. వేలాది మంది గుమిగూడే చోట వైరస్ వ్యాపిస్తుందన్న వార్నింగ్ల్ని సైతం లెక్క చేయలేదు. అంటువ్యాధులు వచ్చినప్పుడు అమ్మవారికి నైవేద్యాలు పెట్టడం మామూలే. అదే ఆనవాయితీతో రోజూ వేలాదిమంది మహిళలు పొంగల్ వండి నైవేద్యం పెడుతున్నారు.
కేరళలో ప్రతి ఏడాది జరిగే ‘అట్లుక్కల్ పొంగల్’ సంబురం ఇప్పుడు చాలా భక్తిగా జరుపుకుంటున్నారు. ఇది వరల్డ్ ఫేమస్ కావడంతో విదేశీ టూరిస్టులుకూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయితే, ఇది నూటికి నూరు శాతం ఆడవాళ్ల పండుగ. మగవాళ్లకు ఇందులో అసలు ప్రవేశమే లేదు. కేరళలో ఇప్పటివరకు మొత్తం ఎనిమిది కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ప్రభుత్వం ఈసారి వేడుకలు జరుపుకోవడానికి పర్మిషన్ ఇస్తుందా అనే అనుమానాలు కూడా వచ్చాయి. ఎందుకంటే, అటుక్కల్ పొంగల్ పండుగని ఎవరింట్లో వాళ్లు కూర్చుని చేసుకోరు. త్రివేండ్రంలోని అటుక్కల్ అమ్మవారి దేవాలయానికి పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చి అక్కడి అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకుంటారు. ఆలయం ప్రాంగణంలోనూ, ఆ చుట్టుపక్కల రోడ్లమీద కూడా అమ్మవారికోసం పొంగల్ వండుతుంటారు. మూడు ఇటుక రాళ్లపై కొత్త కుండను పెట్టి, కట్టెల మంటతో పొంగల్ నైవేద్యం వండుతారు. పది రోజులపాటు జరిగే ఈ వేడుకకు రోజూ వేలాదిమంది మహిళలు వస్తుంటారు. కరోనా వైరస్ భయాన్ని లెక్కచేయకుండా చివరిక్షణంలో పినరయి విజయన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఉత్సవాలు మొదలయ్యాయి. ‘అటుక్కుల్ పొంగల్’ సంబురానికి కొన్ని నెలల ముందు నుంచే ఏర్పాట్లు జరిగాయని ప్రభుత్వం చెబుతోంది. రు. చివరిక్షణంలో కరోనా పేరు చెప్పి పండుగకు పర్మిషన్ ఇవ్వకూడదని అనుకున్నా… జనాలు ఒప్పుకోలేదు. అయితే, ఈ పండుగకి ఫారిన్ టూరిస్టులుకూడా వస్తారు కాబట్టి, చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ ఐడెంటిఫై అయిన దేశాల నుంచి వచ్చేవారిని అమ్మవారి ఆలయం దగ్గరకు రావద్దని ప్రభుత్వం కోరింది. వాళ్లు దిగిన హోటల్లోనే పూజలు చేసుకోవాలని త్రివేండ్రం అధికారులు చెప్పారు.
ఉత్సవాలకు మరిన్ని జాగ్రత్తలు
అమ్మవారి ఆలయానికి వచ్చిన వాళ్లకోసం మెడికల్ ఏర్పాట్లు చేశారు. ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలు ఏమాత్రం కనిపించినా వాళ్లను వెంటనే దవాఖానాల్లో అడ్మిట్ చేస్తారు. ఈ సంబురం అంతటినీ వీడియోగ్రాఫ్ చేస్తున్నట్లు కేరళ హెల్త్ మినిస్టర్ కేకే శైలజ చెప్పారు. ప్రతి అరగంటకోసారి గుడిలోని రెయిలింగ్స్ను క్లీన్ చేయాలని ఆలయ సిబ్బందికి ఆర్డర్లు వేశారు. భక్తులు చేతులు కడుక్కోవడానికి పెద్ద సంఖ్యలో శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. ఉత్సవాలు జరిగినన్నాళ్లూ ఆలయంలోని అనేక ప్రాంతాల్లో హెల్త్ టీంలను ఏర్పాటు చేశారు.
పది రోజుల పాటు ఉత్సవాలు
అటుక్కల్ అమ్మవారి ఆలయాన్ని ‘మహిళా శబరిమలై’ అని కూడా అంటారు. అమ్మవారి చరిత్ర కేరళ పురాణాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. నాలుగు చేతుల్లో ఆయుధాలు ధరించి ఉన్న అమ్మవారిని సరస్వతి, మహాలక్ష్మి, పార్వతిల ముగ్గురి అవతారంగా భావిస్తారు. పండుగ సందర్భంగా మొత్తం పది రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా అమ్మవారి భజనలు ఆలయంలో మార్మోగుతాయి. తొమ్మిదో రోజున జరిగే ‘అటుక్కల్ పొంగల్’కు మహిళలు తెల్లవారుజామున ఆలయానికి వచ్చి కట్టె పొయ్యిల మీద పొంగళ్లు పెట్టి రకరకాల ఆహార పదార్థాలు తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. ప్రతి ఏడాది ఈ వేడుకల్లో లక్షలాది మంది మహిళలు పాల్గొంటారు.
శబరిమలకు రాకండి
అయ్యప్ప స్వామికి ప్రతి నెలా జరిగే పూజలపై కరోనా ప్రభావం పడింది. ఈసారి శబరిమలకు ఎవరూ రావద్దని దేవస్థానం కోరింది. వేలాదిమంది గుమిగూడే చోట కరోనా వేగంగా వ్యాపిస్తుందని హెల్త్ ఎక్స్పర్ట్లు హెచ్చరించడమే ఇందుకు కారణం. అయితే ఆలయంలో ఎలాంటి మార్పులు లేకుండా పూజలు జరుగుతాయని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. ఈ అప్పీల్ గురించి తెలియక ఎవరైనా వస్తే వాళ్లను ఆపబోమని క్లారిటీ ఇచ్చింది. కల్చరల్ యాక్టివిటీని రద్దు చేసుకోవాలని బోర్డు పరిధిలోని మిగతా ఆలయాల కమిటీలకు కూడా సలహానిచ్చింది. మార్చి నెలాఖరు వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఆ తరువాత కరోనా పరిస్థితులపై ప్రభుత్వం సమీక్షించాక ఆంక్షలపై నిర్ణయం తీసుకుంటారు. ఇదిలాఉంటే, పది రోజులపాటు జరిగే ‘అట్లుక్కల్’ సంబురానికి మాత్రం కేరళ ప్రభుత్వం అనుమతినిచ్చింది.