ఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో అతని భార్య నిఖితా సింఘానియాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఆమె ఆచూకీ కనుక్కోవడానికి పోలీసులు గట్టిగానే కష్టపడాల్సి వచ్చింది. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఆమె వేసిన స్కెచ్లు అన్నీఇన్నీ కావు. అతుల్ ఆత్మహత్య కేసులో ఆమెను నిందితురాలిగా చేర్చిన విషయం తెలిసిన వెంటనే ఆమె కనిపించకుండాపోయింది.
రోజుకొక చోటకు మకాం మార్చి ఆమె తన లొకేషన్ను ప్రతిరోజు మార్చేసింది. ఫోన్ కాల్స్ కూడా కేవలం వాట్సాప్ నుంచి మాత్రమే చేసింది. ఒకపక్క ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసింది. కొన్ని రోజుల పాటు పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన నిఖితా సింఘానియా ఒక్క పొరపాటుతో దొరికిపోయింది.
గురుగ్రాంలోని పీజీలోకి మకాం మార్చిన సమయంలో సింఘానియా తన బంధువులతో వాట్సాప్ కాల్లో టచ్లో ఉండేది. కానీ.. ఒక్కసారి పొరపాటున తన తల్లికి వాయిస్ కాల్ చేసింది. అక్కడే సింఘానియా పోలీసులకు దొరికిపోయింది. అప్పటికే నిఖిత మొబైల్ లొకేషన్ను ట్రేస్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు.
ALSO READ | పాలస్తీనా బ్యాగ్తో ప్రియాంక గాంధీ.. అందుకే కాంగ్రెస్కు ఓటమి అన్న బీజేపీ
నిఖిత తన తల్లి నిషా సింఘానియాకు నార్మల్ కాల్ చేయడంతో పోలీసులకు అలర్ట్ వెళ్లింది. పోలీసులు ఆమె టవర్ లొకేషన్ను ట్రాక్ చేశారు. గురుగ్రాంలోని రైల్ విహార్లో ఉన్న పీజీలో నిఖితా సింఘానియా ఉన్నట్లు గుర్తించారు. అలా అతుల్ సుభాష్ భార్య పోలీసులకు దొరికిపోయింది. నాలుగేళ్ల వయసున్న అతుల్ సుభాష్ కొడుకు బంధువుల సంరక్షణలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భార్య వేధింపులు తట్టుకోలేక బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
అతుల్ సుభాష్ 24 పేజీల లేఖను మెయిల్ చేయడంతో అతను అనుభవించిన మానసిక క్షోభ, భార్య నిఖితా సింఘానియా, ఆమె కుటుంబం తనను పెట్టిన టార్చర్ ప్రపంచానికి తెలిసొచ్చింది. భర్త వేధింపులు తట్టుకోలేక భార్యలు క్షోభ పడుతున్నట్టు గానే, భార్యల వేధింపులు తట్టుకోలేక కొందరు భర్తలు కూడా నరకం చూస్తున్నట్లు అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన కళ్లకు కట్టింది. భారతీయ వైవాహిక వ్యవస్థను విస్తుపోయేలా చేసింది. పెళ్లిపై కొందరు బ్యాచిలర్లకు ఉన్న అప నమ్మకం మరింత బలపడటానికి కారణమైంది.