- 60 బొగ్గు బ్లాకులకు ఇయ్యాల వేలం
- హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
- వేలంలో రాష్ట్రంలోని శ్రావణపల్లి గని
- ఇప్పటికే 2 గనులు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి
- రాష్ట్ర సర్కారు ఆదేశాలతో ఈసారి వేలంపాటలో పాల్గొననున్న సింగరేణి
- నామినేషన్ ద్వారా బొగ్గు బ్లాకులు కేటాయించాలని కార్మిక సంఘాల డిమాండ్
కోల్ బెల్ట్ / కొత్తగూడెం, వెలుగు: దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లోని 60 కోల్‌బ్లాకుల వేలానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ రెడీ అయింది. హైదరాబాద్ కేంద్రంగా శుక్రవారం పదోవిడత గనుల వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. వేలం వేయనున్న బొగ్గు బ్లాక్‌ల వివరాలను అధికారికంగా ప్రకటించనప్పటికీ వాటిలో మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం శ్రావణపల్లి ఓసీపీ బొగ్గు గని ఉన్నది. దీంతో పాటు రాష్ట్రానికి చెందిన మరో రెండు బ్లాక్‌లు కూడా ఉండవచ్చనే టాక్ వినిపిస్తున్నది. కీలకమైన శ్రావణపల్లి బొగ్గు గనిని వదులుకోవడం ఇష్టంలేని రాష్ట్ర సర్కారు.. ఈసారి వేలంలో పాల్గొనాలని సింగరేణి సంస్థను ఆదేశించింది.
శ్రావణపల్లి ఓసీపీలో 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలు
హైదరాబాద్‌లో నిర్వహించే పదో రౌండ్ కమర్షియల్ బొగ్గు గనుల వేలంలో అత్యధికంగా ఒడిశాలోని 16 గనులు ఉన్నాయి. ఆ తర్వాత చత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్రాష్ట్రాల్లో 15 చొప్పున గనులు ఉన్నాయి. ఇవికాకుండా జార్ఖండ్ -6, బిహార్ 3, పశ్చిమబెంగాల్3, మహారాష్ట్ర, తెలంగాణలో ఒక్కో గని చొప్పున ఉన్నాయి. ఈ 60 బొగ్గు గనులకుగాను 24 గనుల్లో పూర్తిగా, మిగితా 36 గనుల్లో పాక్షికంగా బొగ్గు అన్వేషణ జరిగింది. వేలం పాటలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు ఏవైనా పాల్గొనే అవకాశం ఉంది. కాగా, వేలం జాబితాలో ఉన్న శ్రావణపల్లి ఓసీపీలో సుమారు 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. 33 ఏండ్ల జీవితకాలం ఉన్న ఈ గనికి 1,937 హెక్టార్ల భూమి అవసరం కాగా 70శాతం ఫారెస్ట్, 30శాతం ప్రైవేటు భూములు సేకరించాల్సి ఉంటుంది. గతంలో జరిగిన వేలంపాటలో ఒక ప్రైవేటు సంస్థ ఈ బ్లాక్‌కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ పోటీదారులెవరూ లేకపోవడంతో రద్దుచేసి, మరోసారి వేలం జాబితాలో చేర్చారు.
టెండర్ లేకుండా సింగరేణికే కేటాయించాలని డిమాండ్
బొగ్గు గనులను వేలం ద్వారా కేటాయించాలని, నామినేషన్ పద్ధతిలో ఇవ్వడానికి వీల్లేదని సుప్రీకోర్టు తీర్పు చెప్పిందని, దాని వల్లే కేంద్ర సర్కార్ ఇప్పటి వరకు తొమ్మిది రౌండ్ల వేలం నిర్వహించి 300 గనులను కేటాయించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తాజాగా పేర్కొన్నారు. బొగ్గు గనులను తనకు ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకోవడానికి గత సీఎం కేసీఆర్ వేలాన్ని వ్యతిరేకించారని, అందుకే వేలంలో పాల్గొనవద్దని సింగరేణిని ఆదేశించారని ఆయన అన్నారు. ఈసారి సింగరేణి ద్వారా వేలంలో పాల్గొంటామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గత కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషీకి చెప్పినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. వేలంలో పాల్గొనే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదాయం వస్తుందన్నారు. సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 51శాతం , కేంద్రానికి 49శాతం వాటా ఉందని, రోజువారీ పరిపాలనాధికారాలన్నీ తెలంగాణ సర్కార్ చేతుల్లోనే ఉంటాయని, సీఎండీని వాళ్లే నియమిస్తారని చెప్పారు. కేంద్రం జోక్యం ఒక శాతం కూడా ఉండదని, ఎప్పటికీ సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయదని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రం నుంచి కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపి బొగ్గు బ్లాకులను టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో సింగరేణికి కేటాయించాలని అన్ని జాతీయ, సింగరేణి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
పదేండ్లుగా సింగరేణికి ఉత్త చేతులే..
కేంద్ర ప్రభుత్వ నిబంధనల కారణంగా సింగరేణికి గడిచిన పదేండ్లుగా ఒక్క కొత్త బొగ్గు బ్లాక్ దక్కలేదు. కొత్త గనులు లేకపోవడం, ఉన్న గనుల్లో బొగ్గు నిల్వలు తగ్గిపోతుండడంతో సంస్థ మనుగడ ప్రమాదంలో పడింది. కొత్త రిక్రూట్మెంట్లు లేక నిరుద్యోగుల్లో నిరాశ అలుముకుంది. మరోవైపు సింగరేణి సంస్థ బొగ్గు గనుల అన్వేషణ మాత్రం ఆపలేదు. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటివరకు వందల కోట్లు ఖర్చుచేసి 12 వేల మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను సింగరేణి గుర్తించింది. వాటిని వెలికితీసేందుకు ప్రణాళికలు వేసుకుంది. ఈ క్రమంలోనే కొత్తగా 20 గనుల వరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ (ఎంఎండీఆర్) చట్టం సింగరేణి ఉత్సాహానికి బ్రేకులు వేసింది. సింగరేణి కూడా మిగిలిన సంస్థల్లాగే వేలం పాటలోనే గనులను దక్కించుకోవాలి.
ఇప్పటికే తెలంగాణలోని శ్రావణపల్లి ఓసీపీ, కేకే 6, సత్తుపల్లి ఓసీపీ, కోయగూడెం ఓసీపీని కేంద్ర బొగ్గు గనులశాఖ వేలం వేసింది. కానీ, గత సీఎం కేసీఆర్ వైఖరి కారణంగా సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనలేదు. దీంతో కోయగూడెం, సత్తుపల్లి ఓసీపీ 3 బొగ్గు బ్లాక్‌లను రెండు ప్రైవేట్ కంపెనీలు టెండర్ల ద్వారా దక్కించుకున్నాయి. కోయగూడెం గనికి నిబంధనల ప్రకారం డబ్బు చెల్లించలేదని కేంద్రం రద్దు చేసి నోటీసులివ్వగా.. వేలంలో దక్కించుకున్న కంపెనీ కోర్టులో కేసు వేసింది. దానిపై విచారణ నడుస్తున్నది. శ్రావణపల్లి గనిని గతేడాది వేలంలో పెట్టినా టెండర్లు రాకపోవడంతో శుక్రవారం మరోసారి వేలం జాబితాలో చేర్చారు. మణుగూరులోని ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్ 2, ఇల్లందు కోయగూడెం ఓపెన్ కాస్ట్ 3 గనులకు కూడా టెండర్లు పిలిచే అవకాశాలున్నాయి.