- 244 ఎకరాలను సాగు చేసుకుంటున్న 154 మంది రైతులు
- బహిరంగ వేలం వేస్తామన్న ఎండోమెంట్ ఆఫీసర్లు
- రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమేనని రైతుల మండిపాటు
- తమకే పూర్తిస్థాయి హక్కులు కల్పించాలని డిమాండ్
మెదక్, శివ్వంపేట, వెలుగు: శివ్వంపేట మండలం దొంతి గ్రామంలోని పురాతన వేణుగోపాల స్వామి ఆలయ భూములను సాగు చేసుకుంటున్న రైతులను వెల్లగొట్టేందుకు సర్కారు యత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులు దశాబ్దాలుగా కాస్తులో ఉన్న ఈ భూములను ఎండోమెంట్ ఆఫీసర్లు బహిరంగ వేలం వేస్తామని చెప్పడం ఇందుకు బలం చేకూరుస్తోంది. పైగా, రైతులు పాల్గొని దక్కించుకోవచ్చని ఆఫర్లు ఇవ్వడం చర్చనీయాంశమైంది. అధికారుల ఆఫర్‌ను తిరస్కరించిన రైతులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం బహిరంగ వేలం అంటున్నారని ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలు తీసుకొని తమకే తమకే పూర్తి హక్కులు కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
1990 వరకు ఇనాం భూమి
వేణుగోపాల స్వామి దేవాలయానికి 242 ఎకరాల భూమి ఉంది. సర్వే నంబర్ 78 నుంచి136, 598, 599 లో ఉన్న ఆ భూములను దశాబ్దాలుగా154 మంది రైతులు సాగు చేసుకుంటున్నారు. భూములు చదును చేసుకుని, బోర్లు వేసుకుని పంటలు పండించుకోవడమే కాదు భూమి శిస్తు కూడా కట్టారు. 1990 వరకు రెవెన్యూ రికార్డుల్లో ఆ భూములు ఇనాం, కరీజ్ ఖాతా కింద ఉండగా, ఆ తర్వాత కిద్మత్ ఇనాం వేణుగోపాల స్వామి దేవాలయం అని రికార్డులలో నమోదు చేశారు. కాగా, ఆ భూములపై పూర్తి స్థాయి హక్కులు కల్పించాలని రైతులు కొన్నేళ్లుగా కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డితో పాటు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును కలిసి వినతిపత్రాలు కూడా ఇచ్చారు.
వేలం వేసేందుకు ప్లాన్
ఓ వైపు రైతులు తాము సాగు చేసుకుంటున్న భూములను తమకే కేటాయించాలని కోరుతుండగా మరోవైపు ఎండో మెంట్ఆఫీసర్లు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఇటీవల గ్రామానికి వచ్చి రైతులతో మీటింగ్ పెట్టారు. వేణుగోపాల స్వామి దేవాలయ భూములను బహిరంగ వేలం వేస్తామని ఆసక్తి ఉన్న వారు అందులో పాల్గొని దక్కించుకోవచ్చని సూచించారు. ఈ ప్రతిపాదనను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. రియల్ఎస్టేట్వ్యాపారుల కోసమే బహిరంగ వేలం అంటున్నారని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వ నిర్ణయించిన ధర ప్రకారం తాము సాగు చేస్తున్న భూములను తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని కోరుతున్నారు.
ప్రాణాలు పోయినా ఒప్పుకోం
మా తాత, ముత్తాతల కాలం నుంచి భూములు సాగు చేసుకుంటున్నం. ఇప్పుడు ఆఫీసర్లు వచ్చి అర్రాస్ పెడ్తమంటున్నరు. మా ప్రాణాలు పోయినా అందుకు ఒప్పుకోం. మాకు ఈ భూములతోనే బతుకు దెరువు. మా పేర్ల మీదనే పట్టా చేసియ్యాలే.
- పిట్ల మల్లమ్మ, రైతు, దొంతి
బతుకులు ఆగమైతయ్
చాలా ఏండ్ల నుంచి ఈ భూమిలోనే పంటలు పండించుకుంటున్నం. భూమి పన్ను కూడా కట్టినం. నా ఇద్దరు కొడుకులు చనిపోయిన్రు. వాళ్లకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఈ భూమి పోతే మా బతుకులు ఆగమైతయ్.
- అనసూయ, రైతు, దొంతి
ప్రభుత్వానికి నివేదిక పంపినం
రెవెన్యూ రికార్డులు పరిశీలిస్తే గతంలో దొంతి భూములు మక్త ఇనాం అని ఉన్నాయి. ఆ తర్వాత ఆలయ పూజారి పేరు వచ్చింది. అనంతరం వేణుగోపాల స్వామి దేవాలయం కిద్మత్ ఇనాం అని ఉంది. ఈ భూములకు సంబంధించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపించాం.
- శ్రీనివాస్ చారి, శివ్వంపేట, తహసీల్దార్