హైదరాబాద్‌‌లో బందోబస్తు మధ్య హౌసింగ్ బోర్డు ప్లాట్ల వేలం

హైదరాబాద్‌‌లో బందోబస్తు మధ్య హౌసింగ్ బోర్డు ప్లాట్ల వేలం
  • కేపీహెచ్‌‌బీలోని హౌసింగ్  బోర్డులో రికార్డు ధరకు ప్లాట్ల కొనుగోలు
  • గజం రూ.లక్షా 85 వేలు పలికిన ధర

హైదరాబాద్/కూకట్‌‌పల్లి, వెలుగు: హైదరాబాద్‌‌లోని కేపీహెచ్‌‌బీ హౌసింగ్ బోర్డులో భారీ బందోబస్తు మధ్య ప్లాట్ల వేలం ముగిసింది. ఈ ప్లాట్లకు రికార్డు స్థాయి ధరలు పలికాయి. గజం అత్యధికంగా రూ.లక్షా 85 వేలు పలకగా, అత్యల్పంగా రూ.లక్షా 5 వేలు పలికిందని హౌసింగ్ బోర్డు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 23 ప్లాట్లకు వేలం నిర్వహించగా, 12 ప్లాట్లకు రూ.25.63 కోట్ల ఆదాయం వచ్చింది. మరోవైపు, ప్రజల నిరసనలు, భారీ పోలీసు బందోబస్తు, ప్రజా ప్రతినిధుల హౌస్ అరెస్టులు, కోర్టు ఆదేశాల నడుమ వేలం పాట ముగిసింది. 

కేపీహెచ్‌‌బీలో నిర్వహించనున్న ప్లాట్ల వేలాన్ని అడ్డుకుంటామని కూకుట్‌‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రకటించడంతో పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు కేపీహెచ్‌‌బీ డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, ఇతర నాయకులనూ అరెస్టు చేశారు. అలాగే, ప్లాట్ల వేలం ఆపాలని కోరుతూ 15వ ఫేజ్ వెల్ఫేర్ అసోసియేషన్​హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో శుక్రవారం కోర్టు ఉత్తర్వులతో వేలం ఆగింది.

 మధ్యాహ్నం తర్వాత వేలం కొనసాగించవచ్చని, అయితే, దీనికి సంబంధించి వివరాలు గోప్యంగా ఉంచాలని, ప్లాట్ల పొజిషన్ కూడా వేలంలో పొందిన వారికి అప్పగించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో హౌసింగ్ బోర్డు అధికారులు వేలం ప్రక్రియను పూర్తి చేశారు. కాలనీలోని మొత్తం 23 ప్లాట్లను వేలానికి పెట్టగా, 12 ప్లాట్లకు వేలం ప్రక్రియ పూర్తయింది. హౌస్ అరెస్టు చేసిన తర్వాత ఎమ్మెల్యే కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజోపయోగానికి వినియోగించాల్సిన ఖాళీ స్థలాలను హౌసింగ్ బోర్డు అధికారులు విక్రయించడం అన్యాయమన్నారు.