- 362 ప్లాట్లకుఈనెల 14న వేలం పాట
- గజానికి రూ.8 వేలుగా నిర్ణయం
- సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షే
ఆదిలాబాద్,వెలుగు: ప్రభుత్వం భూములను అమ్మేస్తోంది. ఇప్పటికే జిల్లాలోని రాజీవ్ సృగృహ కమర్షియల్ ఫ్లాట్లను విక్రయించిన ఆఫీసర్లు... మరోసారి సృగృహ భూములను వేలం వేసేందుకు రెడీ అయ్యారు. మార్చిలో మూడు కమర్షియల్ ఫ్లాట్లను వేలం వేయగా రూ.3.40 కోట్ల ఆదాయం సమకూరింది. ఈనెల 14 నుంచి 18 వరకు ప్లాట్లను బహిరంగ వేలం పాట నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే దీనిపై రెండు సార్లు ఫ్రీ బిడ్ సమావేశం నిర్వహించారు.
362 ప్లాట్లకు వేలం...
ఆదిలాబాద్ జిల్లాలోని మావల మండలంలోని బట్టి సావర్గాం శివారులోని 72 సర్వే నంబర్ లో రాజీవ్ సృగృహ భూముల్లో లే ఔట్లు చేశారు. 26 ఎకరాల్లో 362 ప్లాట్లను ఏర్పాటు చేశారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ లైన్లు, తాగునీటి సదుపాయలు కల్పించనున్నారు. మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ తదితర శాఖలు ప్లాట్లలో అంతర్గత పనులు చేపడుతున్నారు. అయితే ఇంకా పూర్తిస్థాయిలో ప్లాట్ల అభివృద్ధి జరగక ముందే వేలం పాటకు రెడీ చేశారు. ఇది ఇలాఉంటే 2007లోనే రాజీవ్‌స్వగృహ ప్లాట్ల కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. అప్పుడు దరఖాస్తు దారుల నుంచి ఆఫీసర్లు రూ. 3 వేల డీడీ డిపాజిట్‌గా తీసుకున్నారు. 2014లో దరఖాస్తులు చేసుకున్న వారిలో కొంత మందికి ఇండ్ల స్థలాలు ఇవ్వగా, మరో 200 మందికి ఇవ్వాల్సి ఉంది. ఇటీవల రాజీవ్ స్వగృహ ఇంటి స్థలాల సాధన సమితి పేరుతో దరఖాస్తులు దారులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. ప్రస్తుతం రాజీవ్ స్వగృహలో చేస్తున్న ప్లాట్ల వేలం పాట నిలిపివేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. కానీ .. ఆఫీసర్ల నుంచి దీనిపై ఎలాంటి స్పందన కనిపించడం లేదు.
మధ్యతరగతి, సామాన్యులకు కష్టమే..
సర్కారు వేలం పాట వేస్తున్న రాజీవ్ స్వగృహ ప్లాట్లు మధ్యతరగతి, సామాన్యులు కొనే పరిస్థితి కనిపించడంలేదు. సర్కార్ నిర్ణయించిన ధర గజానికి రూ. 8 వేలు కావడంతో 150 గజాల ప్లాట్ కు రూ. 12 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా బహరింగ వేలానికి మధ్యతరగతి ప్రజలు ఆసక్తి చూపించడంలేదు. పూర్తిస్థాయి ప్లాట్లు సిద్ధం కాకుండానే కొనుగోలు చేసిన యజమాని 90 రోజుల్లోనే మొత్తం డబ్బులు కట్టాలనే నిబంధనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో వేలంపాటలో రియల్టర్లు.. రాజకీయ నాయకులు, వ్యాపారులు మాత్రమే పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే ఏరియాలో ఐటీ టవర్ నిర్మాణం కోసం చర్యలు తీసుకోవడంతో ప్లాట్లకు డిమాండ్ ఉండే అవకాశాలు లేకపోలేదు. మరో పక్క కొత్త కలెక్టరేట్‌నిర్మాణం సైతం ప్లాట్లకు దగ్గరలోనే ఉండడం విశేషం.