లెక్కలు చెప్పరు...చిక్కులు విప్పరు

  • మున్సిపాలిటీల్లో పెరుగుతున్న ఆడిట్‌‌‌‌‌‌‌‌ ఆబ్జెక్షన్స్
  • రికవరీకి ఆఫీసర్ల వెనుకంజ

మెట్పల్లి,వెలుగు: జగిత్యాల జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఆడిట్‌‌‌‌‌‌‌‌ ఆబ్జెక్షన్స్ పెరుగుతున్నాయి. ప్రభుత్వ నిధులు ఆఫీసర్లు ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేయడం.. ఆడిట్ ఆఫీసర్లు ఏటా అభ్యంతరాలు చెప్పడం సర్వసాధారణంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా ఖర్చుచేసిన నిధుల రికవరీ సరిగా లేదు. మెట్​పల్లి, కోరుట్ల, జగిత్యాల, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో ఐదేళ్లుగా జరిగిన ఆడిట్​లో పెద్దమొత్తంలో ఆబ్జెక్షన్స్ వచ్చాయి. పనుల వివరాలు చూపించడంలో మున్సిపల్​ ఆఫీసర్లు విఫలమవుతున్నారు. లెక్కలు చూపెట్టని వారు ఖర్చుచేసిన మొత్తాన్ని సంబంధిత అకౌంట్​కు తిరిగి జమచేయాల్సి ఉంటుంది. లేదంటే వారి వేతనాల నుంచి రికవరీ చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది జిల్లాలోని మున్సిపాలిటీల ఆడిట్ లో రూ. 30 కోట్లు ఖర్చులపై సుమారు 1300 అభ్యంతరాలు వచ్చాయి. ఆరేళ్లుగా మెట్ పల్లి మున్సిపాలిటీలో రూ. 9 కోట్ల ఖర్చుపై 420 అభ్యంతరాలు ఉన్నాయి. ఆడిట్‌‌‌‌‌‌‌‌ ఆబ్జెక్షన్స్ ను  ఎప్పటికప్పుడు పరిష్కరించి నిధులను సర్కార్​ఖజానకు జమచేయాల్సిన ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అభివృద్ధి పనుల్లో జవాబుదారితనం లోపిస్తోంది. అయినా ఇప్పటి వరకు ఆబ్జెక్షన్లపై ఉన్నతాధికారులు స్పందించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది.

కనిపించని పారదర్శకత..

మున్సిపాలిటీల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నాయి. వీటితో పాటు బల్దియా టాక్స్ ల రూపంలో వచ్చే ఫండ్స్​తో పాలకవర్గం అభివృద్ధి పనులు చేపడుతోంది. మంజూరైన నిధులు, ఖర్చయిన నిధులపై ఏటా ఆడిట్​జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయా మున్సిపాలిటీ ఆఫీసర్లు ఆదాయం, ఖర్చుల వివరాల రికార్డులు, బిల్లులను ఆడిట్ ఆఫీసర్లకు అప్పగించాల్సి ఉంటుంది. జెన్యూన్ గా ఉన్న బిల్లులను ఆమోదిస్తారు. సక్రమంగా టాక్స్ లు వసూలు చేయకపోయినా, రికార్డుల నిర్వహణ సరిగా లేకున్నా, జరిగిన పనులకు బిల్లుల చెల్లింపులో తేడాలున్నా ఆబ్జెక్షన్ వ్యక్తం చేస్తారు. ఆడిట్‌‌‌‌‌‌‌‌శాఖ లేవనెత్తిన అభ్యంతరాలపై సంబంధిత విభాగాల అధికారులతో రికార్డులను తెప్పించి డ్రాప్‌‌‌‌‌‌‌‌ చేయాల్సిన బాధ్యత ఆయాబల్దియా కమిషనర్‌‌‌‌‌‌‌‌ పైనే ఉంటుంది. కానీ.. ఇక్కడ అలాంటివి ఏమీ జరగడం లేదు.

అక్రమాలపై చర్యలు శూన్యం

ఆడిట్ చేసే ఆఫీసర్లకు ఆ సమయంలో మామూళ్లు సర్వ సాధారణం అనే ఆరోపణలున్నాయి. ఆయా ఆఫీసర్లు ఆడిట్ చేసేందుకు చూపెడుతున్న శ్రద్ధ ఆబ్జెక్షన్లు, అక్రమాలపై చర్యలు తీసుకోకపోవడం ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. నిధులు, ఖర్చులపై సరైన లెక్కలు చుపకపోయినా ఆడిట్ ఆఫీసర్లు కేవలం ఆబ్జెక్షన్లకే పరిమితమై.. చర్యలకు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో ఏటా అభ్యంతరాలు పెరుగుతూనే ఉన్నాయి. దుర్వినియోగం అయిన ఫండ్స్​రికవరీకి అడుగులు ముందుకు పడడంలేదు. అంతేకాదు ఆడిట్ పూర్తయిన 40 రోజుల్లోపు ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉండగా నాలుగేళ్లుగా ఫైనల్ రిపోర్టులు కూడా ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

ఇదీ పరిస్థితి..

మెట్ పల్లి బల్దియాలో ఏడేళ్లలో 420 ఆడిట్‌‌‌‌‌‌‌‌ అభ్యంతరాలు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. 2014–-15 లో  రూ. 4,39,21,194  ఖర్చు చేయగా 78 అభ్యంతరాలు వచ్చాయి. 2015-–16లో రూ.11,66,233 పై 66, 2016–-17లో రూ.73,53,555     పై 69, 2017–-18లో రూ.1,06,36,457 పై 57, 2018-–19లో రూ.1,90,69,656  పై 61, 2019–-20లో రూ.52,69,326  ఖర్చులపై 48, 2020–-21లో రూ.19,38,190  ఖర్చులపై 41 అభ్యంతరాలు ఉన్నాయి. వీటిలో ఖర్చు చేసిన నిధుల వివరాల రికార్డులు సబ్మిట్ చేయనివి రూ. 5,62,43,784, నిధులకు సంబంధించి 66 ఆబ్జెక్షన్లు ఉన్నాయి.

నోటీసులు జారీ చేస్తాం

మున్సిపాలిటీల్లో ఏటా ఆడిట్ నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం ఫైనాన్స్ ఇయర్ ఎండింగ్​లో ఉండడంతో పనుల్లో బిజీగా ఉన్నాం. ఆడిట్ లో గుర్తించిన అభ్యంతరాలపై ఏప్రిల్ లో స్పెషల్ నోటీసులు జారీ చేస్తాం. ఆడిట్ లో ఆబ్జెక్షన్లు కామన్ గా ఉంటాయి. నోటీసులపై స్పందించని వారిపై చర్యలు తీసుకుంటాం.
– సుజాత, జిల్లా ఆడిట్ ఆఫీసర్, జగిత్యాల