ఆగస్టు 20 ఎంతో పవిత్రమైన రోజు.. శ్రావణ మాసం ఆదివారం ఏం చేయాలంటే..

ఆగస్టు 20 ఎంతో పవిత్రమైన రోజు.. శ్రావణ మాసం ఆదివారం ఏం చేయాలంటే..

శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు. ప్రతి వారమూ పవిత్రమైందే. ప్రతి తిథి విశేషమైందే. అనుక్షణం భగవానుడి చింతన తప్ప మరొకటి ఉండదు ఈ నెలలో. వరలక్ష్మి వత్రం, మంగళగౌరి వ్రతం, శ్రావణ మాస వ్రతం, శివ వ్రతం, జీవంతికాదేవీ వ్రతం, నారసింహ వ్రతం, ఆంజనేయ వ్రతం ఇలా వివిధ తిథి, వారాల్లో నెల పొడవునా నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది. ఈ వ్రతాల ఉద్దేశం పారమార్థిక చింతనే.   దేవుడిపై భక్తి విశ్వాసాలు ఏర్పడే ఉద్దేశంతో ఇలా వ్రతాలు ఏర్పాటు చేశారు.  అభిషేక ప్రియః శివః అన్నారు పెద్దలు. నిండు మనసుతో నాలుగు చెంబుల నీళ్లు పోసినా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు.

ద్వాదశేష్వపి మాసేషు, శ్రావణః శివరూపకః  అంటే పన్నెండు నెలల్లో శ్రావణ మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉందని  సనత్కుమార మహర్షికి చెప్పారని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. శ్రావణ మాసంలో ఆదివారం రోజున పరమశివుడిని, విష్ణుమూర్తిని  కలిపి పూజించాలని పండితులు చెబుతున్నారు.  శ్రావణ మాసంలో శివుడికి రుద్రాభిషేకం చేస్తే  విష్ణుమూర్తి కూడా సంతృప్తి చెందుతాడట.  శివ భగవానుడిని పూజించి.. ఆ తరువాత విష్ణు సహస్రనామం పఠించాలని చెబుతున్నారు.  అలా అవకాశం లేకపోతే  విష్ణు సహస్రనామాన్ని విన్నా కాని ఎంతో పుణ్య ఫలం లభిస్తుందని  పండితులు చెబుతున్నారు.

సనత్కుమార   మహర్షి కోరిక మేరకు  శ్రావణమాస మహాత్మ్యాన్ని 24 అధ్యాయాలలో పరమ శివుడు  వివరించాడని పురాణాల్లో పేర్కొన్నారు . యశ్చ శ్రవణ మాత్రేణ సిద్ధిదః శ్రావణోప్యతః  మిగతా నెలల్లో అనుష్ఠానం చేస్తే ఫలితం కలుగుతుంది. శ్రావణంలో శివుడి ప్రాశస్త్యాన్ని శ్రవణంతోనే సకల కార్యాలు నెరవేరుతాయని స్కాంద పురాణంలో ఉందని పండితులు చెబుతున్నారు.  శక్తి ఉన్నవాళ్లు నిత్యం రుద్రాభిషేకం గానీ, అతి రుద్రాభిషేకం గానీ, మహా రుద్రాభిషేకంతో గానీ ఈశ్వరుడిని అభిషేకిస్తే మేలు కలుగుతుంది. శక్తి మేరకు దానధర్మాలు చేస్తూ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందాలి. అంతేకాదు, తనకు ఇష్టమైన ఆహార పదార్థాన్ని గానీ, ఇష్టమైన వస్తువును గానీ దానమిచ్చి వదిలిపెట్టే సంప్రదాయమూ ఉంది.

ఆదివారం సూర్య భగవానుడికి  ఇష్టమైన రోజు. ఇక శ్రావణ మాసంలో వచ్చే ఆదివారాలకు చాలా విశిష్టత ఉంది.  అసలే పూజలకు, వ్రతాలకు,నోములకు  ప్రాధాన్యత ఇచ్చే నెల. కాని పురాతన సంప్రదాయాలు, సనాతన ధర్మాలు, హిందూ శాస్త్రాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు పూర్తిగా మారిపోతున్నాయి.  వారం రోజుల్లో ఆదివారం అత్యంత పవిత్రమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆదివారం సూర్యభగవానుడు జన్మించిన రోజు. మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు.   అనాదిగా రుషులు, పండితులు, పంచాగ కర్తలు మొదలగు వారందరూ  సూర్యోపాసకులు.. సూర్యుణ్ని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి. సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్షదైవం. అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారం గానే వస్తాయి. ప్రాతః కాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యా వందనాలు లాంటి సనాతన సాంప్రదాయ కర్మలు సూర్యుణ్ని ఆరాధించే పద్దతిలో ముఖ్యమైనవి.

 ఆదివారం హిందువులకు ఎంతో పవిత్రమైన రోజు.అది చూసి తట్టుకోలేక బ్రిటీషు వాడు థామస్ బాబింగ్టన్ మెకాలే ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించి సర్వ హిందూ ఆచార, వ్యవహాలను పూర్తిగా మార్చేశాడు. హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశారు. ఫలితంగా ఆదివారం ఇలాంటి పవిత్రమైనరోజు తాగుబోతులకి, తిండిపోతులకి ఇష్టమైన రోజుగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించే వారు.. ఆరోజు జీవహింస చేసి మాంసాన్ని తినేవారు కాదు. ఆదివారం మద్యపానం అసలు ముట్టేవారు కాదు. మార్చిన పద్దతులు, పాశ్చత్య పోకడలు, విదేశీ సంస్కృతి పూర్తిగా హిందూ సంప్రదాయాన్ని విదేశీ కల్చర్‌గా మార్చేసింది. ఆదివారమొస్తే సెలవు దినం కదా అని మద్యాహ్నం 12 గంటల దాకా పడుకునే వారు ఎక్కువ మంది ఉన్నారు. 

 అసలు ఆదివారం ఏం చేయకూడదో చెప్పే ఓ శ్లోకం కూడా ఉంది. 

అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే 
 సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా
 స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే 
 న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం స గచ్చతి 

 ఆదివారం రోజున మాంసం తినడం, మద్యం తాగడం, స్త్రీతో సాంగత్యం చేయడం, క్షవరం చేసుకోవటం చేయడం మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇవే కాదు చివరకు తలకు నూనె పెట్టుకోవడం కూడా చేయరాదని చెబుతోంది.  అలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్రం పాలు చేస్తున్నారని శాస్త్రం తెలిసిన వాళ్లు మదనపడుతున్నారు. మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు ...ఎన్ని ఆచారాలు, సంస్కృతులు భిన్నంగా ఉన్న మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వాన్ని తెలిపేది మన హైందవ సంస్కృతి అనే విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు. ఆదివారం సెలవువద్దని ఆదివారం పవిత్ర దినంగా చూడాలని, ఆ రోజున తెల్లవారు జామున నిద్రలేచి సూర్య నమస్కారం, యోగా చేయడం,ప్రాణాయామం చేయండి, సూర్యోపాసన చేయండి వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందమంటూ శాస్త్రం తెలిసిన వాళ్లు సూచిస్తున్నారు.