
శ్రావణం శివానుగ్రహానికి చాలా అనువైన మాసం. ఈ మాసం అంతా శివుడికి ప్రత్యేక పూజలు, జపాలు, అభిషేకాలు చేస్తారు శివారాధకులు. ఉపవాసం కూడా చేస్తారు. హిందూ సనాతన ధర్మశాస్త్రం శ్రావణ సోమవారం ( ఆగస్టు 21)నాడు ఆరాధన, జపం చెయ్యడం శ్రేష్ఠమైందిగా పరిగణిస్తుంది. శ్రావణ సోమవారం నాడు శివారాధన చేస్తే సకల దు:ఖాలు నశిస్తాయని నమ్మకం. శివుడి కరుణా కటాక్షం శ్రావణంలో పూజలు చేసుకునే వారి మీద అపారంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు శ్రావణ సోమవారం నాడు జ్యోతిష్యాన్ని అనుసరించి ఏయే రాశుల వారు ఎలాంటి దాన ధర్మాలు చెయ్యాలనే విషయాలను కూడా ఇక్కడ తెలుకుందాం.
శ్రావణ మాసంలో శుక్ల పక్షం ఐదవ రోజున నాగపంచమి జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది నాగ పంచమికి ఎంతో విశిష్టత ఉంది. ఈసారి ఆగస్టు 21 సోమవారం , నాగ పంచమి ఒకే రోజు వచ్చాయి. ఈ రోజు(ఆగస్టు 21) పాముల రాజుకు అంకితం చేయబడింది. నాగారాధన అనేది హిందూ సంస్కృతి, సంప్రదాయంలో ఒక భాగం. శ్రావణ మాసంలో శుక్ల పక్షం ఐదవ రోజున నాగపంచమి జరుపుకుంటారు. అంతే కాకుండా నాగదేవతగా భావించే శుభ్రమణ్యేశ్వరుని తండ్రి శివుడి. శివ భగవానుడికి సోమవారం అంటే ఎంతో ఇష్టం. పంచమి, సోమవారం వచ్చిందంటే చాలు శివాలయాలు, కిటకిటలాడుతుంటాయి.
సోమవారం నాడు ఏ రాశి వారి ఎలాంటి దానం చేస్తే ఫలితాలు కలుగుతాయో జ్యోతిష్య నిపుణులు సూచనలను తెలుసుకుందాం.
మేషరాశి :
మేషరాశి వారు శివుని అనుగ్రహం పొందడానికి శ్రావణ సోమవారం నాడు పిండి, పంచదార, బెల్లం దానం చెయ్యడం మంచిదని పండితులు చెబుతున్నారు. మిఠాయిలు దానం చేసినా మంచి ఫలితం ఉంటుందట. ఇలాంటి దానాల వల్ల మేషరాశి వారికి పనుల్లో విజయం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
వృషభ రాశి
వృషభ రాశి వారు శివానుగ్రహంయ పొందాలంటే శ్రావణ సోమవారాల్లో పాలు, పెరుగు, అన్నం, పరిమళ ద్రవ్యాలు, సువాసన కలిగిన వస్తువులు దానం చెయ్యాలని పండితులు సూచిస్తున్నారు . ఇలా చెయ్యడం వల్ల సుఖం, సంపద కలుగుతాయని పురాణాల్లో పేర్కొన్నారని పండితులు చెబుతున్నారు.
మిథున రాశి
శ్రావణ మాసంలో సోమవారం నాడు పెసరపప్పు, పచ్చి కూరగాయలు, ఆకుపచ్చని పళ్లను దానం చెయ్యడం, శివుడి వాహనమైన నందికి అంటే ఎద్దుకు పచ్చిగడ్డి మేతగా తినిపించడం వల్ల మిథున రాశి వారికి ఆదాయం పెరుగుతుందని పండితులు సూచిస్తున్నారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు శ్రావణ మాసంలో నాలుగో సోమవారం నాడు శివుని అనుగ్రహం పొందడానికి బ్రాహ్మణ పుణ్య స్త్రీలకు వెండి పాదుకలు, వేపపువ్వు దానం చెయ్యాలని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు . అన్నం, పంచదార, నెయ్యి, నీళ్లు అవసరమైన వారికి ఇవ్వడం ద్వారా కూడా మంచి ఫలితాలు ఉంటాయట.
సింహ రాశి
సింహరాశి వారు శ్రావణ సోమవారం నాడు శివుడిని పూజించిన తరువాతి బెల్లం, గోధుమలు, పప్పులు, తేనె దానం చెయాలని పండితులు సూచిస్తున్నారు. ఇలా చెయ్యడం వల్ల సూర్యభగవానుని అనుగ్రహం లభించి వృత్తి వ్యాపారాల్లో విజయం చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
కన్యారాశి
కన్యారాశి వారు శ్రావణ సోమవారం నాడు బ్రాహ్మణ పుణ్య స్త్రీలకు అలంకరణ వస్తువులు, అద్దాలు దానం చెయ్యాలి. ఈ పరిహారం చెయ్యడం వల్ల అన్ని పనుల్లో విజయం సంప్రాప్తిస్తుందని పురోహితులు చెబుతున్నారు.
తులారాశి
తులారాశి వారు శివుడి అనుగ్రహం పొందడానికి శ్రావణ సోమవారం నాడు పాలు, పెరుగు, బియ్యం, తెల్లని వస్త్రాలు దానం ఇవ్వాలట. మీకు ఆత్మీయులుగా భావించే వారికి పెర్ఫ్యూమ్, అలంకరణ సామాగ్రి బహుమానంగా ఇస్తే శివుడి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు శ్రావణ సోమవారం నాడు బెల్లం, తేనె, పంచదార, ఎర్రమిరపకాయలు దానం చేయాలని చెబుతున్నారు. ఈ పరిహారం చెయ్యడం ద్వారా జాతకంలో కుజద్రహం వల్ల కలిగే ప్రభావం తొలగి పోతుందట. దీనితో పాటు కుజుడి అనుగ్రహం కూడా దొరకుతుందని పండితులు సూచిస్తున్నారు.
ధనుస్సురాశి
ధనస్సు రాశి వారు శ్రావణ సోమవారాల్లో బొప్పాయి, చందనం, శనగపప్పు, పసుపు, కుంకుమ, మిఠాయిలు దానం ఇవ్వాలని పండితులు సూచిస్తున్నారు. ఇలా చెయ్యడం వల్ల జాతకంలో గురు స్థానం బలపడి మనోబలం పెరుగుతుంది.
మకరరాశి
మకర రాశి వారు శ్రావణ సోమవారాల్లో కొబ్బరి నల్ల నువ్వులు, చీపురు, రాజ్మా, నల్ల శనగలు వంటి వాటిని దానం చెయ్యాలని చెబుతున్నారు. ఇలా చెయ్యడం వల్ల మనిషి జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు.
కుంభరాశి
కుంభరాశి వారు శ్రావణ సోమవారం నాడు పేద, వికలాంగులకు సహాయం చెయాలంటున్నారు పండితులు . డబ్బు మందులు, బట్టలు విరాళంగా ఇస్తే వల్ల శివుడు ప్రసన్నుడై దీవెనలు అందిస్తాడని శివ పురాణంలో ఉందని పండితులు చెబుతున్నారు.
మీనరాశి
మీనరాశి వారు శివుని ప్రసన్నం చేసుకోవడానికి శ్రావణ సోమవారం నాడు పుణ్యస్త్రీలకు పసుపురంగు గాజులు బహుకరిస్తే మంచిదని చెబుతున్నారు. వీటితో పాటు అరటి పండు, శనగపప్పు, కుంకుమ పువ్వు వేసిన పాలు, శనగ పిండి వంటి వాటిని ఎవరికైనా ఇవ్వాలని సూచిస్తున్నారు.