జులైలో ఊర్లు మునిగిపోయేంతంతా భారీ వర్షాలు పడితే ఆగస్టుకొచ్చేసరికి సీన్ రివర్స్ అయిపోయింది. అసలు చినుకు జాడ కనిపించలేదు. జులైలో పంటలు మునిగితే.. ఇప్పుడు వానల్లేక పంటలు ఎండుతున్నాయి. ఆగస్టు నెలలో 62 శాతం లోటు వర్షపాతం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. తొలి రెండు వారాల్లో 95 శాతం లోటు వర్షపాతం నమోదైంది. సగటు వర్షపాతం 217 మి.మీ. కాగా.. కేవలం 79.7 మి.మీ. మాత్రమే కురిసింది. 1901 తరువాత అత్యంత పొడిగా ఈ ఏడాది ఆగస్టు నమోదైంది. ఈ ఏడాది ఆగస్టులో ఇప్పటివరకు 32 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఐఎండీ డేటా ప్రకారం 1913లో 24.1 శాతం, 1920లో 24.4 శాతం, 1965లో 24.6 శాతం, 2005లో 25 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.
ప్రధానంగా ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు గణనీయంగా తగ్గి, తేమశాతం కూడా అదేస్థాయిలో తగ్గుముఖం పట్టడమే దీనికి కారణమని వాతావరణ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. జూన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 567 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా.. 642 మిల్లీమీటర్లు నమోదైనట్టు వాతావరణ శాఖ చెప్తుండటం గమనార్హం.గత ఏడాది తెలంగాణలో 121.36 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ పంటలు సాగుచేయగా, ప్రస్తుత ఏడాది 116.35 లక్షల ఎకరాల్లోనే సాగు చేయడం గమనార్హం.
ALSO READ:తూకం గిన్నె కింద క్యూఆర్ కోడ్.. ఆంటీ రాక్, కస్టమర్ షాక్..
ఎల్‌నినో ఎఫెక్ట్ ఉండొచ్చని జులై రెండో వారంలోనే ఐఎండీ సూచనప్రాయంగా చెప్పింది. అదే ఇప్పుడు నిజమైందని వాతావరణ నిపుణులు అంటున్నారు. పశ్చిమ పసిఫిక్ సముద్రంలో ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడడం వల్లే రుతుపవనాల గమనం మందకొడిగా సాగుతున్నదని చెప్తున్నారు. అయితే సెప్టెంబర్ తొలి వారం నుంచి పరిస్థితి కాస్తంత మెరుగుపడొచ్చని ఐఎండీ హైదరాబాద్ శాఖ సైంటిస్ట్ శ్రావణి తెలిపారు. ప్రస్తుతం బంగాళాఖాతంపై తుఫాను ఆవర్తనం ఏర్పడిందని చెప్పారు.
ఈ ప్రభావంతో వర్షాలు మళ్లీ దండిగా పడే చాన్స్ ఉందని తెలిపారు. అక్టోబర్ రెండో వారంలో రుతుపవనాలు వెళ్లిపోయేంత వరకు మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 43 రోజులు వర్షాలు పడ్డాయి. ములుగు జిల్లాలో అత్యధికంగా 47 రోజులు, భద్రాద్రి జిల్లాల్లో 45 రోజుల పాటు పడ్డాయి. అత్యల్పంగా హైదరాబాద్లో 22 రోజులే కురిశాయి. రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.