క్యాన్సర్‌తో పోరాటం.. భారత మాజీ క్రికెటర్ కన్నుమూత

క్యాన్సర్‌తో పోరాటం.. భారత మాజీ క్రికెటర్ కన్నుమూత

భారత మాజీ క్రికెటర్‌ ఔన్‌షుమాన్‌ గైక్వాడ్‌ (71) క్యాన్సర్‌తో దీర్ఘకాలంగా పోరాడుతూ బుధవారం (జూలై 31) మరణించారు. బ్లడ్ క్యాన్సర్ బారిన పడిన అతను లండన్ లో చికిత్స తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. అన్షుమాన్ గైక్వాడ్ చికిత్స కోసం 1983 ప్రపంచ కప్ గెలిచిన జట్టు సభ్యులు అతని క్యాన్సర్ చికిత్స నిధులు కోసం పాలు పంచుకున్నారు.

కపిల్ దేవ్, సందీప్ పాటిల్, సునీల్ గవాస్కర్, మొహిందర్ అమర్‌నాథ్, రవిశాస్త్రి తదితర భారత మాజీ క్రికెటర్లు గైక్వాడ్ వైద్య ఖర్చుల కోసం నిధులు కేటాయించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేయగా అతని చికిత్స కోసం వెంటనే  కోటి రూపాయలను విడుదల చేయాలని బీసీసీఐ సెక్రటరీ జయ్ షా ఆదివారం (జూలై 14) సంబంధిత అధికారులను ఆదేశించారు.   

గైక్వాడ్ ప్రస్తుత వయసు 71 సంవత్సరాలు. భారత్ తరపున 1974 నుంచి 1987 వరకు క్రికెట్ ఆడారు. 40 టెస్టుల్లో 29 యావరేజ్ తో 1985 పరుగులు చేశారు. అతని ఖాతాలో రెండు సెంచరీలు 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 15 వన్డేల్లో 20 యావరేజ్ తో 269 పరుగులు చేశారు. టెస్టుల్లో అత్యధిక స్కోర్ 201 కాగా.. వన్డేల్లో 78. 

1997 నుండి 2000 మధ్య కాలంలో రెండు సార్లు భారత జట్టు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. అతను కోచ్ గా ఉన్నప్పుడు భారత క్రికెట్ జట్టు  2000 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీలో రెండవ స్థానంలో నిలిచింది. కోచింగ్ బాధ్యతలతో పాటు..  గైక్వాడ్ 1990లో జాతీయ సెలెక్టర్, ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు.జూన్ 2018లో గైక్వాడ్ CK నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు.