ఔరంగజేబు సమాధి వివాదం.. నాగ్‌‌పూర్‌‌లో హింస

ఔరంగజేబు సమాధి వివాదం.. నాగ్‌‌పూర్‌‌లో హింస

ముంబై: ఔరంగజేబు సమాధిని తొలగించాలనే డిమాండ్ తో నాగ్‌పూర్‌లోని మహల్‌లో విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన నిరసన సోమవారం సాయంత్రం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతోపాటు అనేక వాహనాలకు నిప్పుపెట్టడంతో  పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, ఒక వర్గంవారు పోలీసులపై కూడా రాళ్లు రువ్వారు. దాంతో పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన పోలీసులు..రెండు వర్గాలపై లాఠీచార్జి చేసి, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. 

దాంతో మహల్‌లో ఘర్షణలు ఆగిపోయి ప్రశాంతత నెలకొంది. మరోసారి ఉద్రిక్తత ఏర్పడకుండా అదనపు పోలీసు బలగాలను మోహరించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఘటనలో  నలుగురు పౌరులు గాయపడగా..దాదాపు 12 నుంచి 15 మంది పోలీసులకు గాయాలయ్యాయి. 25నుంచి 30 బైకులు, 3 కార్లు దగ్ధమయ్యాయి.  పోలీసులు 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. పుకార్లు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టారు.