ఏపీలో 108, 104 సేవలు అందిస్తున్న అరబిందో సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది.. ఇంకా రెండేళ్లు గడువు ఉన్నప్పటికీ సేవల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది అరబిందో. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ పంపింది. గత ప్రభుత్వ హయాంలో బిల్లుల విషయంలో ఇబ్బంది పడ్డామని.. అందుకే సేవల నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయినట్లు తెలిపింది అరబిందో. అరబిందో సక్రమంగా సర్వీసులు అందించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా ఇందుకు మరో కారణమని తెలుస్తోంది.
ఈ క్రమంలో త్వరలోనే ప్రభుత్వం 108, 104 సేవలకు సంబంధించి కొత్త టెండర్లకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యశ్రీ ట్రస్టుతో ఏడేళ్ల కాలపరిమితితో 2020 జులై 1న జరిగిన ఈ ఒప్పందం నుండి అరబిందో ముందుగానే తప్పుకోవాలని డిసైడ్ అయ్యింది. 2027 వరకు గడువు ఉన్నప్పటికీ రెండేళ్ల ముందే సేవల నుంచి తప్పుకుంటోంది అరబిందో.
టెండర్లలో అరబిందో మాత్రమే ఎంపికయ్యేలా గత వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు కూడా అప్పట్లో వార్తలొచ్చాయి. వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి అల్లుడు ఈ వ్యవహారంలో కీరోల్ ప్లే చేసినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం అరబిందోకు పూర్తి అనుకూలంగా వ్యవహరించడానికి ఇది కూడా ఒక కారణమని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.