APలోని అరబిందో యూనిట్‌‌కు వార్నింగ్‌‌ లెటర్

APలోని అరబిందో యూనిట్‌‌కు వార్నింగ్‌‌ లెటర్

హైదరాబాద్‌‌, వెలుగు : ఆంధ్ర ప్రదేశ్‌‌లోని శ్రీకాకుళం అరబిందో ఫార్మా యూనిట్‌‌కు యూఎస్‌‌ ఎఫ్‌‌డీఏ వార్నింగ్‌‌ లెటర్‌‌ జారీ చేసింది. ఈ ఏడాది మొదట్లో ఈ యూనిట్‌‌ తనిఖీలు పూర్తయ్యాయి. యాక్టివ్‌‌ ఫార్మా ఇన్‌‌గ్రీడియెంట్స్‌‌ (ఏపీఐ) తయారు చేసే శ్రీకాకుళం యూనిట్‌‌ (11) కు వార్నింగ్‌‌ లెటర్‌‌ వచ్చినట్లు అరబిందో ఫార్మా స్టాక్ ఎక్స్చేంజ్‌‌లకు తెలిపింది. ఐతే, యూనిట్‌‌ ఇప్పుడు నిర్వహిస్తున్న బిజినెస్‌‌పై ఈ లెటర్ ప్రభావం చూపెట్టదని చెబుతున్న అరబిందో ఫార్మా, ఆ వార్నింగ్‌‌ లెటర్లో ఏముందో మాత్రం వెల్లడించలేదు. యూఎస్‌‌ ఎఫ్‌‌డీఏతో కలిసి ఈ ఇబ్బందిని వీలయినంత తొందరలో పరిష్కరించుకుంటామని అరబిందో ఫార్మా తెలిపింది. ప్రపంచంలోని తమ ప్లాంట్లన్నిటిలోనూ ఉత్తమ ప్రమాణాలను పాటించాలనేదే  లక్ష్యమని పేర్కొంది.

ఎఫ్‌‌డీఏ వార్నింగ్‌‌తో షేర్లకు నష్టం
శ్రీకాకుళం యూనిట్‌‌కు ఎఫ్‌‌డీఏ వార్నింగ్‌‌ లెటర్ జారీ చేసిందనే వార్తలతో అరబిందో ఫార్మా షేరు శుక్రవారం 4 శాతం నష్టపోయింది. బీఎస్‌‌ఈలో షేర్‌‌ ధర 3.92 శాతం తగ్గి రూ. 602.35 వద్ద ముగిసింది. ఒక దశలో షేర్‌‌ 7.68 శాతం నష్టపోయి రూ. 578.75 ని తాకింది. ఇక ఎన్‌‌ఎస్‌‌ఈలోనూ షేర్ ధర 3.85 శాతం తగ్గి రూ. 603 వద్ద ముగిసింది. బీఎస్‌‌ఈలో 4.47 లక్షల అరబిందో ఫార్మా  షేర్లు చేతులు మారగా, ఎన్‌‌ఎస్‌‌ఈలో ఏకంగా 74 లక్షల షేర్లు చేతులు మారాయి.