వన్డే ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ విశ్వరూపం చూపించిన విషయం తెలిసిందే. వాంఖడే స్టేడియంలో బౌండరీల వర్షం కురిపించాడు. 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సుల సాయంతో డబుల్ సెంచరీ సాధించిన మ్యాక్సీ.. జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్‌లో మాక్స్‌వెల్ ఒకవైపు గాయం ఇబ్బంది పెడుతున్నా.. దాన్ని ఏమాత్రం లెక్క చేయలేదు. ఒక దశలో అతడు నిలబడటం కూడా కష్టమైంది. అలాంటిది బంతి బౌండరీ వెళ్లిన ప్రతిసారి ఎంతో కొంత ఉపశమనం పొందుతూ క్రికెట్ ప్రపంచంలో చిరకాలం గుర్తుండిపోయే బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. నిజానికి 92 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచిన ఆసీస్‌ను అతడు గెలిపించిన తీరు అసాధారణమని చెప్పుకోవాలి. కాకపోతే మాక్స్‌వెల్ అంత బాధపడుతూ ఎందుకు కొనసాగించాడనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. రన్నర్ సాయం ఎందుకు తీసుకోలేదని వారిలో వారు ప్రశ్నించుకుంటున్నారు.
రన్నర్ సాయం ఎందుకు తీసుకోలేదు..?
గతంలో ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు బ్యాటర్లు.. రన్నర్ సాయం తీసుకునేవారు. గాయపడినా, అసౌకర్యంగా అనిపించినా రన్నర్ సాయం కోరేవారు. అలాంటి ఇన్నింగ్స్ మీరు చూసే ఉంటారు. అయితే, ఈ నిర్ణయం వల్ల కొన్ని సందర్భాల్లో ఆ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న జట్టు నష్టపోవాల్సి వచ్చేది. దీంతో ఫిర్యాదులు ఎక్కువ అవ్వడంతో 2011 నుంచి దీన్ని తీసివేశారు. 2011లో జరిగిన ఐసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో రన్నర్ సాయం తీసుకునే అవకాశం లేకుండా నిబంధనల్లో మార్పులు చేశారు. ఈ కారణంగానే మాక్స్‌వెల్ కండరాలు పట్టేసినా రన్నర్ సాయం తీసుకోలేదు.
#GlenMaxwell
— ताड़कासुर (@TaadkasurX) November 8, 2023
Your team is 7 wickets down for 91 runs. Your target is 292. There's a bowler batting at the other end. You get cramps midway. What would you do?
Well, someone did the unthinkable. Glenn Maxwell made 201* off 128 deliveries. This is THE greatest ODI knock! pic.twitter.com/D3UIXUbEU1
అంతర్జాతీయ మ్యాచ్‌లకే ఈ రూల్
రన్నర్ ను అనుమతించకపోవడమనే నిబంధన అంతర్జాతీయ మ్యాచ్ లకు మాత్రమే. దేశవాలీ, ఇతర టోర్నీల్లో మాత్రం యథావిధిగా రన్నర్ సాయం తీసుకోవచ్చు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 291 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (129 నాటౌట్) ప్రపంచ కప్ లో తొలి సెంచరీ నమోదు చేశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి 46.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.