IND Vs AUS: రేపే (జనవరి 03) ఆస్ట్రేలియాతో ఐదో టెస్ట్‌.. టీవీల్లో లైవ్ ఇలా చూసేయండి

IND Vs AUS: రేపే (జనవరి 03) ఆస్ట్రేలియాతో ఐదో టెస్ట్‌.. టీవీల్లో లైవ్ ఇలా చూసేయండి

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఆఖరి టెస్టుకు కౌంట్‌డౌన్ మొదలైంది. శుక్రవారం(జనవరి 03) నుంచి సిడ్నీ వేదికగా ఐదో టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా ఎలాగైనా ఈ టెస్టును సైతం గెలిచి ట్రోఫీని ఎగరేసుకుపోవాలని చూస్తుండగా.. ఆఖరి పోరులో గెలిచి పరువు కాపాడుకోవాలనే ప్రయత్నంలో టీమిండియా ఉంది.

కెప్టెన్‌గా బుమ్రా..!

పరుగులు చేయలేక నానా తంటాలు పడుతున్న భారత కెప్టెన్ రోహిత్‌ శర్మ  సిడ్నీ టెస్టుకు దూరంగా ఉండనున్నాడని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అతని నిర్ణయాన్ని ప్రధాన కోచ్‌ గౌతమ్ గంభీర్‌ సైతం గౌరవించడాని కథనాలు వస్తున్నాయి. అదే జరిగితే బుమ్రా భారత జట్టును నడిపించనున్నాడు. ప్రస్తుతం  అతడే జట్టుకు వైస్‌ కెప్టెన్‌. అందునా పెర్త్ టెస్టులో బుమ్రా నాయకత్వంలోనే టీమిండియా విజయం సాధించింది.

ఒకవేళ రోహిత్ తప్పుకుంటే, శుభ్‌మన్‌ గిల్‌కు తుదిజట్టులో చోటు ఖాయం. సర్ఫరాజ్ ఖాన్ నుంచి అతనికి పోటీ ఉన్నప్పటికీ, గిల్ వైపే మేనేజ్మెంట్ మొగ్గు చూపొచ్చు. ఇక గాయపడిన ఆకాష్ దీప్ స్థానంలో హర్షిత్ రాణా జట్టులోకి రానున్నాడు.  

మార్ష్ స్థానంలో వెబ్‌స్టర్

మరోవైపు, ఆస్ట్రేలియా ఆఖరి టెస్టులో ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ఆల్-రౌండర్ మిచెల్ మార్ష్ స్థానంలో బ్యూ వెబ్‌స్టర్‌ (Beau Webster) ఆసీస్ తరుపున టెస్ట్ అరంగ్రేటం చేయనున్నాడు. మార్ష్‌ను తప్పించడం వెనక క్రికెట్ ఆస్ట్రేలియా గాయాన్ని సాకుగా చూపుతున్నా.. రాణించకపోవటమే అందుకు ప్రధాన కారణమని నివేదికలు చెప్తున్నాయి. మార్ష్ నాలుగు టెస్టుల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేదు. కేవలం 73 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ రాణించింది లేదు. దాంతో అతనిపై వేటు పడినట్లు తెలుస్తోంది.

ALSO READ | IND vs AUS: ఎవరీ బ్యూ వెబ్‌స్టర్.. సిడ్నీ టెస్టులో ఆరున్నర అడుగుల బుల్లెట్

లైవ్ స్ట్రీమింగ్

టాస్ 4:30 గంటలకు వేయనుండగా.. మ్యాచ్ ఉదయం 5:00 గంటలకు ప్రారంభమవుతుంది. టీవీల్లో స్టార్ స్పోర్ట్స్‌ ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారాలు చూడవచ్చు. డిజిటల్‌గా మొబైల్‌లో చూడాలనుకుంటే, డిస్నీ+ హాట్‌స్టార్‌ యాప్‌లో లైవ్ ఆస్వాదించవచ్చు.

భారత జట్టు (అంచనా): కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా జట్టు: సామ్ కాన్‌స్టాస్‌, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.