AUS vs SA: పోరాడి ఓడిన సఫారీలు.. దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా ఘనవిజయం

AUS vs SA: పోరాడి ఓడిన సఫారీలు.. దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా ఘనవిజయం

ఐదుసార్లు వన్డే ప్రపంచ కప్ విజేత ఆస్ట్రేలియా మరోసారి ఫైనల్ చేరింది. గురువారం క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ వేదికపై దక్షిణాఫ్రికాను 3 వికెట్ల తేడాతో చిత్తుచేసిన కంగారూలు.. ఫైనల్‌లో భారత్‌తో అమీతుమీ తేల్చుకోనున్నారు. మొదట సఫారీ బ్యాటర్లను 212 పరుగులకే కట్టడి చేసిన ఆసీస్ ఆటగాళ్లు.. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని 7  వికెట్లు కోల్పోయి చేధించింది.

213 పరుగుల ఛేదనలో ఆసీస్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్(62; 48 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్(29; 18 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్సర్లు) ధనాధన్ బ్యాటింగ్‌తో హోరెత్తించారు. టీ20ని తలపించేలా మైదానం నలువైపులా బౌండరీలు బాదుతూ పరుగుల వరద పారించారు. వీరిద్దరి ధాటికి ఆసీస్ తొలి ఆరు ఓవర్లలోనే 60 పరుగులు చేసింది. అనంతరం ధాటిగా ఆడే ప్రయత్నంలో వార్నర్.. మార్క్ రమ్ బౌలింగ్‌లో బౌల్డ్ అవ్వగా, ఆ మరుసటి ఓవర్‌లోనే మిచెల్ మార్ష్(0) డకౌట్‌గా వెనుదిరిగాడు.  ఆపై దూకుడు మరింత పెంచిన హెడ్.. గెరాల్డ్ కోయెట్జీ వేసిన 12వ ఓవర్‌లో వరుసగా హ్యాట్రిక్ ఫోర్లు బాది.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

అనంతరం ట్రావిస్ హెడ్ ఔటయ్యాక ఆసీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినా.. లక్ష్యం చిన్నది కావడంతో సఫారీ జట్టుకు ఓటమి తప్పలేదు. ఆఖరిలో మిచెల్ స్టార్క్(16 నాటౌట్), కమ్మిన్స్(14 నాటౌట్) జోడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. స్టీవ్ స్మిత్(30), మార్నస్ లాబుచానే(18) పరుగులు చేశారు. సఫారీ బౌలర్లలో షంషీ, కోయెట్జీ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. రబడా, మార్క్‌రమ్, మహరాజ్ తలో వికెట్ తీసుకున్నారు.

మిల్లర్ ఒంటరి పోరాటం

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన సఫారీ జట్టు ఆసీస్ పేసర్ల ధాటికి 212 పరుగులకే కుప్పకూలింది. విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్(101) సెంచరీ చేయగా.. హెన్రిచ్ క్లాసెన్(47) పరుగులు చేశాడు. టెంబా బవుమా(0), క్వింటన్ డికాక్‌(3), డసెన్‌ (6), మార్‌క్రమ్‌ (10) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్,  కమ్మిన్స్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. హేజిల్‌ వుడ్‌, ట్రావిస్ హెడ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.