AUS vs SA: మిల్లర్ ఒంటరి పోరాటం.. ఆస్ట్రేలియా ముందు ఈజీ టార్గెట్

AUS vs SA: మిల్లర్ ఒంటరి పోరాటం.. ఆస్ట్రేలియా ముందు ఈజీ టార్గెట్

కోల్‌కతా, ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీఫైనల్ పోరులో దక్షిణాఫ్రికా బ్యాటర్లు విఫలమయ్యారు. టోర్నీ ఆసాంతం పరుగుల వరద పారించిన సఫారీ వీరులు.. కీలక మ్యాచ్‌కు వచ్చేసరికి చేతులెత్తేశారు. దీంతో సౌతాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగుల దగ్గర ఆలౌట్ అయ్యింది. విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్(101; 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు.

ఆదుకున్న మిల్లర్- క్లాసెన్‌

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన సఫారీ బ్యాటర్లు ఆది నుంచే పెవిలియన్‌కు క్యూ కట్టారు. లీగ్ దశలో పోటీపడి సెంచరీలు బాదిన సౌతాఫ్రికా స్టార్‌ బ్యాటర్లు టెంబా బవుమా(0), క్వింటన్ డికాక్‌(3), డసెన్‌ (6), మార్‌క్రమ్‌(10)లు 25 పరుగుల లోపే పెవిలియన్‌ చేరారు. అనంతరం మిల్లర్‌- క్లాసెన్‌(47) జోడి జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరూ వికెట్ల పతనాన్ని అడ్డుకోవడంతో పాటు కంగారూ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 95 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. 

ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని ఆసీస్‌ పార్ట్‌టైమ్‌ బౌలర్‌ ట్రావిస్‌ హెడ్‌ విడదీశాడు. అక్కడినుండి మిల్లర్ లోయర్ ఆర్డర్ బ్యాటర్ల సాయంతో వీలైనన్ని పరుగులు చేశాడు. చివరలో గెరాల్డ్ కోయెట్జీ(19) పర్వాలేదనిపించాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కమ్మిన్స్  మూడేసి వికెట్లు పడగొట్టగా.. హేజిల్‌ వుడ్‌, ట్రావిస్ హెడ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.