AUS vs WI: విండీస్ చారిత్రాత్మక విజయం.. దుఃఖాన్ని ఆపుకోలేకపోయిన లారా

AUS vs WI: విండీస్ చారిత్రాత్మక విజయం.. దుఃఖాన్ని ఆపుకోలేకపోయిన లారా

గబ్బా వేదికపై వెస్టిండీస్ జట్టు సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై తమను ఓడించలేరని విర్రవీగే కంగారూలకు విండీస్ వీరులు సరైన గుణపాఠం నేర్పారు. 27 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. సరికొత్త చరిత్రకు నాంది పలికారు. ఈ గెలుపుతో ఆజట్టు మాజీ దిగ్గజం బ్రియాన్ లారా ఆనందంలో మునిగిపోయారు. సంతోషాన్ని పట్టలేక కంటతడి పెట్టుకున్నారు. విజయం సాధించిన మరుక్షణం ఆసీస్ మాజీ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ని కౌగిలించుకున్నారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

వన్డే ప్రపంచ కప్‌కు అర్హత సాధించకపోవంతో వెస్టిండీస్ జట్టుపై ఎవరికి పెద్దగా అంచనాల్లేవు. ఆఖరికి ఆ జట్టు మేనేజ్మెంట్‌కు కూడా వారిపై ఎలాంటి ఆశల్లేవు. తమ జట్టు ఆసీస్ పర్యాటనకు వెళ్ళొస్తే చాల్లే అనుకున్నారు. అలాంటిది విండీస్ వీరులు అద్భుతం చేశారు. స్మిత్, ఖవాజా, లబుచానే, మార్ష్, హెడ్ వంటి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆసీస్ ను మట్టికరిపించారు. అందునా.. కెరీర్ లో తొలి టెస్ట్ సిరీస్ ఆడుతున్న విండీస్ బౌలర్ షమార్ జోసెఫ్ అసాధారణ పటిమ కనపరిచాడు. 7 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు.

భారత్, వెస్టిండీస్

గబ్బా వేదికగా గత 35 ఏళ్లలో కేవలం మూడు జట్లు మాత్రమే ఆస్ట్రేలియాను ఓడించాయి. 1988, 2024లో వెస్టిండీస్ రెండింటిలో విజయం సాధించగా, 2021లో భారత జట్టు విజయం సాధించింది. కంగారూలకు పెట్టని కోటగా ఉన్న గబ్బాలో.. విండీస్ విజయం మరుపురానిదే. ప్రస్తుతం ఆ జట్టు క్రికెటర్లు సంబరాలు చేసుకుంటున్నారు. బీర్ బాటిళ్లు చేత పట్టుకుని డ్రెస్సింగ్ రూమ్ లో డ్యాన్స్‌లు చేస్తున్నారు.

ఈ మ్యాచ్ విషయానికొస్తే.. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకై ఆలౌట్ అయ్యింది. తద్వారా 22 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని ఆసీస్ ముందు 216 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ చేధించలేకపోయింది. 207 పరుగులకు ఆలౌటై.. విజయానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆఖరివరకూ స్టీవ్ స్మిత్(91) క్రీజులో ఉన్నప్పటికీ జట్టును ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు.