Glenn Maxwell: పీకల దాకా తాగి ఆసుపత్రి పాలైన మ్యాక్స్‌వెల్.. సస్పెన్షన్ వేటు!

Glenn Maxwell: పీకల దాకా తాగి ఆసుపత్రి పాలైన మ్యాక్స్‌వెల్.. సస్పెన్షన్ వేటు!

ఆస్ట్రేలియన్ విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లెన్  మ్యాక్స్‌వెల్ వివాదంలో చిక్కుకున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) అనుమతి లేకుండా ఓ సంగీత కచేరీలో పాల్గొన్న మాక్స్‌వెల్ అక్కడ పీకల దాకా తాగి ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటనను క్రికెట్ ఆస్ట్రేలియా సీరీయస్‌గా తీసుకుంది. దీనిపై విచారణ ప్రారంభించింది.   

ఏం జరిగిందంటే..?

శుక్రవారం(జనవరి 19) అడిలైడ్‌లో  ఓ సంగీత కచేరీ జరగ్గా..  మ్యాక్స్‌వెల్ అందులో పాల్గొన్నాడు. అక్కడ అతిగా మద్యం సేవించడంతో అతన్ని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడా అతను కుదురుగా ఉండలేదు. ప్రాథమిక చికిత్స చేసిన వెంటనే అక్కడినుండి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయాడు. పైగా ఏమీ ఎరగనట్టు మరుసటి రోజు శిక్షణకు హాజరయ్యాడు. 

ఈ విషయం బయటకి పొక్కడంతో క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ ప్రారంభించింది. అడిలైడ్‌లో జరిగిన సంగీత కచేరీలో మాక్స్‌వెల్ సంఘటన గురించి తమకు తెలిసిందని క్రికెట్ ఆస్ట్రేలియా ధృవీకరించింది. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించామని తెలిపింది. ఒకవేళ ఈ ఘటనలో అతని ప్రమేయం ఉన్నట్లు తెలిస్తే సస్పెన్షన్ వేటు పడొచ్చని విశ్లేషకులు చెప్తున్నారు.

ఫిబ్రవరి 2 నుంచి వెస్టిండీస్‍తో ప్రారంభంకానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నుంచి  మ్యాక్స్‌వెల్కు క్రికెట్ ఆస్ట్రేలియా విశ్రాంతినిచ్చింది. అతని స్థానంలో యువ విధ్వంసకర హిట్టర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్‌కు అవకాశమిచ్చింది. 

ఆస్ట్రేలియా వన్డే జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్ (వైస్ కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), మార్నస్ లాబుస్‌చాగ్నే, లాన్స్ మోరిస్, మాట్ షార్ట్, ఆడమ్ జాంపా.