- కమిన్స్‌కు రూ. 20.50 కోట్లు పెట్టిన సన్‌రైజర్స్
- 20 ఏండ్ల సమీర్ రిజ్వీకి రూ. 8.4 కోట్లు
దుబాయ్: ఐపీఎల్2024 మినీ వేలం మెగా లీగ్‌లో రికార్డులు బద్దలు కొట్టింది. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ క్రికెటర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్‌పై కోట్ల వర్షం కురిపించింది. గత 16 సీజన్లలో ఏ ఆటగాడికి సాధ్యంకాని రూ. 20 కోట్ల మార్కును ఈ ఇద్దరూ ఒకేసారి దాటేశారు. మంగళవారం దుబాయ్‌లో జరిగిన వేలంలో ఈ ఇద్దరి కోసం ఫ్రాంచైజీలు పోటీ పడటంతో ఐపీఎల్‌లో అత్యధిక ధర రికార్డు నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు బ్రేక్ అయింది.
తొలుత సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. 20.50 కోట్లతో ఆసీస్ కెప్టెన్ కమిన్స్‌ను కొనుగోలు చేసి ఆశ్చర్యపరిచింది. దాంతో గతేడాది రూ. 18.50 కోట్లతో సామ్ కరన్ (పంజాబ్ కింగ్స్) టాప్ రేటు రికార్డు బద్దలైంది. కాసేపటికే గుజరాత్ టైటాన్స్‌తో బిడ్డింగ్ వార్‌లో గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్క్‌కు ఏకంగా రూ. 24.75 కోట్లు వెచ్చించి ఔరా అనిపించింది. దాంతో ఎనిమిదేండ్ల తర్వాత ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇస్తున్న స్టార్క్ మెగా టోర్నీ చరిత్రలో అత్యంత విలువైన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
కమిన్స్‌తో పాటు వరల్డ్ కప్ ఫైనల్ హీరో ట్రావిస్ హెడ్‌ను సన్‌రైజర్స్ రూ. 6.80 కోట్లకు తమ టీమ్‌లోకి తీసుకుంది. న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్‌ను సీఎస్కే రూ. 14 కోట్లతో తిరిగి తమ జట్టులోకి తెచ్చుకుంది. ఇండియా పేస్ ఆల్‌రౌండర్ హర్షల్ పటేల్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 11.75 కోట్లకు, వెస్టిండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్‌ను ఆర్‌సీబీ రూ. 11.50 కోట్లకు కొనుగోలు చేశాయి. ఆసీస్ పేసర్ స్పెన్సర్ జాన్సన్ రూ. 10 కోట్లతో గుజరాత్ టైటాన్స్ టీమ్‌లో చేరాడు. మొత్తంగా పేరున్న ఇంటర్నేషనల్ పేసర్లు, ఆల్‌రౌండర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.
ఎందుకింత రేటు?
వరల్డ్‌లోనే టాప్ పేసర్లు కావడం, ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉండటంతో ఫ్రాంచైజీలు స్టార్క్, కమిన్స్ వెంట పడ్డాయి. అదే సమయంలో సన్ రైజర్స్, కోల్‌కతా, గుజరాత్ టీమ్స్‌లో మెయిన్ ఫారిన్ పేసర్లు లేకపోవడంతో వీళ్ల పంట పడినట్టయింది. తొలుత కమిన్స్‌ను సన్ రైజర్స్ తీసుకోవడంతో స్టార్క్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని కేకేఆర్, గుజరాత్ ప్రయత్నించాయి.
ఇది వరకు రెండే సీజన్లు ఆడిన స్టార్క్ 27 మ్యాచ్‌ల్లో 20.38 సగటుతో34 వికెట్లు పడగొట్టాడు. ఇక, వరల్డ్ కప్‌లో చెలరేగిన కివీస్ ఓపెనర్ రచిన్ రవీంద్రను రూ. 1.8 కోట్లకు, శార్దూల్ ఠాకూర్ రూ. 4 కోట్లకు చెన్నై కొనుగోలు చేసింది. కీపర్ కేఎస్ భరత్, చేతన్ సకారియా, మనీశ్ పాండేను వారి ప్రారంభ ధర రూ. 50 లక్షలకే కేకేఆర్ సొంతం చేసుకుంది.
72 మందికి రూ.230 కోట్లు
వేలంలో పది ఫ్రాంచైజీలు 30 మంది ఫారినర్స్ సహా 72 మందిని కొనుగోలు చేశాయి. ఇందుకు రూ. 230.45 కోట్లను ఖర్చు చేశాయి. వేలం తర్వాత రాజస్తాన్ (22), కోల్‌కతా (23) తప్ప ఎనిమిది ఫ్రాంచైజీలు 25 మంది ప్లేయర్ల పూర్తి కోటాతో నిలిచాయి. ఢిల్లీ వద్ద ఇంకా9.90 కోట్లు ఉండగా, రాజస్తాన్ వద్ద 20 లక్షలే మిగిలాయి.
మన కుర్రాళ్లపైనా కోట్ల వర్షం
వేలంలో ఫారిన్ స్టార్లతో పాటు మన దేశవాళీ కుర్రాళ్లు కూడా దుమ్ము రేపారు. ఇందులో యూపీకి చెందిన యంగ్ బ్యాటర్ సమీర్ రిజ్వీకి సీఎస్కే రూ. 8.4 కోట్లు పెట్టింది. 20 ఏండ్ల రిజ్వీ ఈ ఏడాది యూపీ టీ20 లీగ్‌తో వెలుగులోకి వచ్చాడు. టోర్నీలో అత్యధిక సిక్సర్లు, ఫాస్టెస్ట్ సహా రెండు సెంచరీలతో చెలరేగాడు. ఇక, పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసిన షారూక్ ఖాన్‌ను గుజరాత్ టైటాన్స్ రూ. 7.4 కోట్లకు కొనుగోలు చేసింది.
మరోవైపు జార్ఖండ్ కీపర్ బ్యాటర్ కుమార్ కుశాగ్ర రూ. 7.2 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో చేరాడు. కుశాగ్ర ఇటీవల జరిగిన విజయ్ హజారే టోర్నీలో మహారాష్ట్రపై 37 బాల్స్‌లోనే 67 రన్స్‌తో మెరిశాడు. తన కోసం సీఎస్కే, జీటీ కూడా పోటీ పడ్డాయి. విదర్భకు చెందిన మిడిలార్డర్ బ్యాటర్ శుభం దూబే కోసం పలు ఫ్రాంచైజీలు పోటీ పడగా.. చివరకు రూ. 5.8 కోట్లకు అతను రాజస్తాన్ రాయల్స్ జట్టులో చేరాడు. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ తరఫున రాణించిన 26 ఏండ్ల పేసర్ యశ్ దయాల్‌ను ఆర్‌సీబీ రూ. 5 కోట్లకు సొంతం చేసుకుంది. శివం మావి రూ. 6.4 కోట్లకు లక్నో టీమ్‌లో చేరాడు.