మెల్‌బోర్న్: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఆస్ట్రేలియా రెండో టెస్ట్‌లోనూ గ్రాండ్ విక్టరీ సాధించింది. కెప్టెన్ పాట్ కమిన్స్ (10/97) రెండోసారి 10 వికెట్ల హాల్ సాధించడంతో నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ 79 రన్స్ తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరోటి మిగిలి ఉండగానే కంగారూలు 2–0తో కైవసం చేసుకున్నారు.
ఆసీస్ నిర్దేశించిన 317 రన్స్ టార్గెట్‌ను ఛేదించేందుకు శుక్రవారం బరిలోకి దిగిన పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 67.2 ఓవర్లలో 237 రన్స్‌కే ఆలౌటైంది. కెప్టెన్ షాన్ మసూద్ (60), ఆగా సల్మాన్ (50), బాబర్ ఆజమ్ (40), రిజ్వాన్ (35) పోరాడి విఫలమయ్యారు. స్టార్క్ 4 వికెట్లు తీశాడు.
అంతకుముందు 187/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 84.1 ఓవర్లలో 262 రన్స్‌కు ఆలౌటైంది. అలెక్స్ క్యారీ (53) హాఫ్ సెంచరీ చేశాడు. షాహిన్, మిర్ హమ్జా చెరో నాలుగు వికెట్లు తీశారు. కమిన్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.