
లాహోర్: చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా రికార్డుల దుమ్ము దులిపింది. ఇంగ్లండ్‌లో పుట్టిన జోష్ ఇంగ్లిస్ (86 బాల్స్‌లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 120 నాటౌట్) మెగా టోర్నీలో అదే జట్టుపై భారీ సెంచరీతో రెచ్చిపోయాడు. అలెక్స్ క్యారీ (69), మాథ్యూ షార్ట్ (63) కూడా చెలరేగడంతో ఇంగ్లండ్ ఇచ్చిన 352 రన్స్ టార్గెట్‌ను ఆసీస్ ఈజీగా ఛేజ్ చేసింది. ఐసీసీ ఈవెంట్లలో అత్యధిక టార్గెట్‌ను ఛేజ్ చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది.
శనివారం జరిగిన ఈ గ్రూప్–బి లీగ్ మ్యాచ్‌లో భారీ స్కోరును కాపాడుకోలేకపోయిన ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో ఆసీస్ చేతిలో ఓడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు 50 ఓవర్లలో 351/8 స్కోరు చేసింది. బెన్ డకెట్ (143 బాల్స్‌లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో 165) టోర్నీలో అత్యధిక స్కోరు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. జో రూట్ (68) ఫిఫ్టీ కొట్టాడు. ఫిల్ సాల్ట్ (10), జెమీ స్మిత్ (15) నిరాశపర్చడంతో ఇంగ్లండ్ 43/2తో కష్టాల్లో పడింది. ఈ దశలో డకెట్.. రూట్‌తో మూడో వికెట్‌కు 158, బట్లర్ (23)తో ఐదో వికెట్‌కు 61 రన్స్ జోడించి జట్టుకు మంచి స్కోరు అందించాడు.
ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వారిషస్ 3, జంపా, లబుషేన్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత ఆస్ట్రేలియా 47.3 ఓవర్లలో 356/5 స్కోరు చేసి నెగ్గింది. ఐసీసీ టోర్నీల్లో ఇదే అత్యధిక స్కోరుతో పాటు హయ్యెస్ట్ రికార్డు ఛేజ్ కావడం విశేషం. 2023 వన్డే వరల్డ్ కప్‌లో శ్రీలంకపై పాకిస్తాన్ ఛేజ్ చేసిన 345 రన్స్ టార్గెట్ రికార్డు బ్రేక్ అయింది. హెడ్ (6), స్మిత్ (5) ఫెయిలైనా.. షార్ట్, లబుషేన్ (47) మూడో వికెట్‌కు 95 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. 14 రన్స్ తేడాతో ఈ ఇద్దరూ ఔటైనా.. ఇంగ్లిస్ వీరోచిత సెంచరీతో ఆకట్టుకున్నాడు.
అలెక్స్ క్యారీతో కలిసి ఐదో వికెట్‌కు 146 రన్స్, మ్యాక్స్‌వెల్ (32 నాటౌట్)తో ఆరో వికెట్‌కు 36 బాల్స్‌లోనే 74 రన్స్ జోడించి జట్టును గెలిపించాడు. ఇంగ్లిస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇండియా లేకున్నా స్టేడియంలో ‘జనగణమన’మ్యాచ్ ప్రారంభానికి ముందు గడాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియా జాతీయ గీతానికి బదులుగా ‘జనగణమన’ను ప్లే చేశారు. దీంతో ఆసీస్ ప్లేయర్లు, ఫ్యాన్స్ షాకయ్యారు. వెంటనే ఆప్రమత్తమైన నిర్వాహకులు జనగణమనను ఆపేసి ఆసీస్ జాతీయ గీతాన్ని ప్లే చేశారు.