భారత్ తో వన్డే సిరీస్ కి ఆస్ట్రేలియా జట్టుని ప్రకటించేశారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఆసీస్..ఆ తర్వాత భారత్ కి పయనం కానుంది. ఈ నెల 22,24,27 తేదీల్లో ఇండియాతో మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత్ వెళ్లబోయే 18 మంది ఆసీస్ జట్టుని ప్రకటించగా.. సీనియర్లు రీ ఎంట్రీ ఇచ్చారు. గాయం కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరమైన కెప్టెన్ కమ్మిన్స్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ తో పాటు స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్ వెల్ జట్టులో చేరారు. అయితే దక్షిణాఫ్రికా పర్యటనలో గాయం కారణంగా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కి ఈ స్క్వాడ్ లో చోటు దక్కలేదు.
పూర్తి స్థాయి జట్టుతోనే
భారత్ లో వచ్చే నెలలో వరల్డ్ కప్ జరగనుండడంతో ఆసీస్ పూర్తి జట్టుతో ఈ సిరీస్ ఆడబోతుంది. వరల్డ్ కప్ కి ముందు భారత్ లో వన్డే సిరీస్ కావడంతో ఇక్కడ పరిస్థితులను అర్ధం చేసుకోవడానికి ఆస్ట్రేలియా జట్టుకి ఇదొక చక్కని అవకాశం. మరో వైపు టీమిండియాకు కూడా ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుతో ఆడటం కలిసి వచ్చేదే. ఇక తొలి వన్డే మొహాలీ, రెండో వన్డే ఇండోర్,మూడో వన్డే రాజ్ కోట్ లో జరుగుతాయి. మ్యాచులన్నీ భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1:30 నిమిషాలకు జరుగుతాయి. జియో టీవీలో ఫ్రీగా ఈ మ్యాచులు ప్రసారమవుతాయి.