కడుపులో ఉన్నప్పుడే కిడ్నీ వ్యాధి బారిన పడ్డా.. ఎప్పటికీ నయం కాదు: స్టార్ క్రికెటర్ 

కడుపులో ఉన్నప్పుడే కిడ్నీ వ్యాధి బారిన పడ్డా.. ఎప్పటికీ నయం కాదు: స్టార్ క్రికెటర్ 

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ మాజీ ఆటగాడు కామెరూన్ గ్రీన్ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. తాను కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నానని.. ఈ విషయం తన తల్లిదండ్రులకు తప్ప మరెవరికి తెలియదని వెల్లడించాడు. తన తల్లి 19 వారాల ప్రెగ్నెన్సీ సమయంలో ఉన్నప్పుడే తాను ఈ వ్యాధి బారిన పడినట్లు వారికి తెలిసిందని తెలిపాడు.

"నాకు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉందని నేను పుట్టినప్పుడు నా తల్లిదండ్రులు చెప్పారు. ఆ వ్యాధికి లక్షణాలేమి లేవు. అల్ట్రాసౌండ్‌తో గుర్తించాలి. కిడ్నీలు ఎప్పటికీ కోలుకోలేవు. ఇతరుల కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేసినట్లుగా నా మూత్రపిండాలు పనిచేయవు. ప్రస్తుతం 60 శాతం పనిచేస్తున్నాయి..''

"కాకపోతే ఒకరకంగా అదృష్టవంతుడిని. మూత్రపిండ వ్యాధిలో ఐదు దశలు ఉన్నాయి. మొదటి దశలో ఈ వ్యాధి ప్రభావం తక్కువగా ఉంటుంది. ఐదవ దశలో రక్తాన్ని శుద్ధిచేయాల్సి(డయాలసిస్) ఉంటుంది. అదృష్టవశాత్తూ, నేను రెండవ దశలో ఉన్నాను. ఎప్పటికప్పుడూ ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. సరిగా చూసుకోకపోతే దశ మారుతుంది.." అని గ్రీన్ ఛానల్ 7 ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 

ఈ విషయంపై గ్రీన్ తండ్రి(గ్యారీ గ్రీన్) మాట్లాడుతూ.. మొదట్లో గ్రీన్ త్వరగా కోలుకోలేదని, అతన్ని ఇంక్యుబేటర్‌లో ఉంచామని వెల్లడించాడు.  ఆ సమయంలో డాక్టర్లు మీ కొడుకు 12 ఏళ్లకు మించి బతకలేడని తనతో చెప్పారని ఆయన గ్యారీ గ్రీన్ తెలిపారు. గ్రీన్ తల్లి బీ గ్రేస్ లీ మాట్లాడుతూ.. 19 వారాల ప్రెగ్నన్సీ స్కానింగ్ సమయంలో ఈ వ్యాధి గురించి తెలిసిందని, తమ కొడుకు తమ కళ్ళముందే ఉండేలా చూడాలని దేవుడిని ప్రార్థిస్తూనే ఉన్నామని చెప్పుకొచ్చారు.

ముంబై To ఆర్‌సీబీ 

కాగా, గ్రీన్ వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తరపున ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఇటీవల ఆర్‌సీబీ ఫ్రాంచైజీ ట్రేడ్ రూపంలో గ్రీన్‌ను ముంబై ఇండియన్స్‌ నుంచి కొనుగోలు చేసింది. రూ. 17.5 కోట్లు వెచ్చించి అతన్ని సొంతం చేసుకుంది.