ఆస్ట్రేలియా ఆఫ్‌స్పిన్నర్ నాథన్ లియాన్ ఉదారతను చాటుకున్నాడు. వికలాంగ క్రికెటర్ల సంక్షేమం కోసం తాను జ్ఞాపకాలుగా సేకరించుకున్న బ్యాట్లన్నీ విరాళంగా ఇచ్చారు. భారత స్టార్లు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ సహా ఆసీస్ క్రికెటర్లు పాట్ కమ్మిన్స్, స్టీవ్ స్మిత్‌లు సంతకం చేసిన బ్యాట్లను లియోన్.. నేషనల్ క్రికెట్ ఇన్‌క్లూజన్ ఛాంపియన్‌షిప్(NCIC)కి విరాళంగా ఇచ్చారు.
ఈ 37 ఏళ్ల స్పిన్నర్ విరాళంగా ఇచ్చిన బ్యాట్లపై బ్రెయిలీ లిపిలో 'స్పోర్ట్ ఫర్ ఆల్' అని సందేశం ఉంది. అగ్రశ్రేణి క్రికెటర్లు తరువాతి తరాన్ని క్రీడలో పాల్గొనేలా ఎలా ప్రేరేపించాలనే అనే దానిపై అతను క్రికెట్ ఆస్ట్రేలియాతో మాట్లాడిన మాటలు.. యువ క్రికెటర్లలో స్ఫూర్తి నింపేలా ఉన్నాయి. దేశానికి రోల్ మోడల్‌గా నిలిచే అగ్రశ్రేణి క్రికెటర్లు.. సమాజ సేవలోనూ, ఇతరులకు సహాయం చేయడంలోనూ ముందుండాలని అతను చెప్పిన మాటలు.. అందరినీ ఆశ్చర్యపరిచాయి.
ALSO READ | IND vs ENG 1st T20I: తొలి టీ20 మనదే.. చిత్తుచిత్తుగా ఓడిన ఇంగ్లాండ్
లియాన్ విరాళంగా ఇచ్చిన బ్యాట్లను వేలం వేయనున్నారు. తద్వారా వచ్చిన డబ్బును అంగ వైకల్యం ఉన్న క్రికెటర్ల సంక్షేమం కోసం ఉపయోగించనున్నారు.
ఏంటి ఈ NCIC..?
నేషనల్ క్రికెట్ ఇన్‌క్లూజన్ ఛాంపియన్‌షిప్ (NCIC) అంగ వైకల్యం ఉన్న క్రికెటర్ల మధ్య జరిగే టోర్నమెంట్. జనవరి 19 నుండి జనవరి 24 మధ్య బ్రిస్బేన్‌లోని మార్చంట్ పార్క్ వేదికగా మ్యాచ్‌లు జరుగుతాయి. ఏడు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన 22 జట్లు ఈ పోటీలో ఉన్నాయి.