- 3 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై విక్టరీ
- ఇబ్రహీం జద్రాన్ సెంచరీ వృథా
ముంబై : ఆస్ట్రేలియా టార్గెట్ 50 ఓవర్లలో 292 రన్స్.. 18.3 ఓవర్లలో కంగారూల స్కోరు 91/7.. గెలవాలంటే 201 రన్స్ చేయాలి.. చేతిలో మూడే వికెట్లు ఉన్నాయి.. ఇక విజయంపై ఆశలు వదిలేసుకున్న తరుణంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (128 బాల్స్‌లో 21 ఫోర్లు, 10 సిక్స్‌లతో 201 నాటౌట్) అద్భుతం చేశాడు. ఎదుర్కొన్న తొలి బాల్‌కే ఎల్బీ నుంచి బయటపడి.. 34 రన్స్ వద్ద క్యాచ్ ఔట్‌ను తప్పించుకుని.. మధ్యలో తొడ కండరాలు పట్టేసినా.. వెన్ను నొప్పి తీవ్రంగా ఇబ్బందిపెట్టినా.. పరుగెత్తడం పక్కనబెడితే.. నడవడానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో ఓ యోధుడిగా సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.
క్రీజులో కాలు కదపకుండా తన పవర్ హిట్టింగ్ ట్రేడ్ మార్క్ షాట్లతో అఫ్గాన్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. ఫలితంగా మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై గెలిచి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 50 ఓవర్లలో 291/5 స్కోరు చేసింది. ఇబ్రహీం జద్రాన్ (143 బాల్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 129 నాటౌట్) సెంచరీతో చెలరేగగా, రషీద్ ఖాన్ (18 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 35 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తర్వాత ఆసీస్ 46.5 ఓవర్లలో 293/7 స్కోరు చేసింది. మ్యాక్స్‌వెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
తొలి సెంచరీతో రికార్డు
మ్యాచ్‌కు ముందు సచిన్ మాటలతో స్ఫూర్తి పొందిన 21 ఏళ్ల జద్రాన్ సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సెంచరీతో పాటు అఫ్గాన్ తరఫున అరుదైన రికార్డులనూ ఖాతాలో వేసుకున్నాడు. తమ దేశం తరఫున వరల్డ్ కప్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా, ఆసీస్‌పై వంద కొట్టిన తొలి అఫ్గాన్ ప్లేయర్‌గానూ, మెగా ఈవెంట్‌లో అఫ్గాన్ తరఫున హయ్యెస్ట్ స్కోరు చేసిన ఫస్ట్ బ్యాటర్‌గానూ రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో 2015 స్కాట్లాండ్‌పై సమీయుల్లా షెన్వారీ (96) చేసిన హయ్యెస్ట్ స్కోరు రికార్డును అధిగమించాడు. ఓపెనర్ రహమానుల్లా గుర్బాజ్ (21) తొలి వికెట్‌కు 38 రన్స్ జత చేసి ఔటైనా, రెండో ఎండ్‌లో జద్రాన్ స్థిరంగా ఆడాడు.
మిడిలార్డర్‌లో రహమత్ షా (30)తో రెండో వికెట్‌కు 83, కెప్టెన్ హష్మతుల్లా షాహిది (26)తో మూడో వికెట్‌కు 57 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను పటిష్టం చేశాడు. అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (22), మహ్మద్ నబీ (12) ఉన్నంతసేపు మెరుగ్గా ఆడారు. వీళ్లిద్దరితో కలిసి 60 రన్స్ జత చేశాడు. చివర్లో రషీద్ మెరుపులు మెరిపించాడు. స్టార్క్, జంపా బౌలింగ్‌లో సిక్స్‌లు కొట్టి ఆరో వికెట్‌కు 58 రన్స్ జత చేశాడు. దీంతో ఆఖరి ఐదు ఓవర్లలో 64 రన్స్ రావడంతో అఫ్గాన్ మంచి టార్గెట్‌ను నిర్దేశించింది. హాజిల్‌వుడ్ 2, స్టార్క్, మ్యాక్స్‌వెల్, జంపా తలా ఓ వికెట్ తీశారు.
91 రన్స్‌కే 7 వికెట్లు..
ఛేజింగ్‌లో ఆసీస్‌ను అఫ్గాన్ బౌలర్లు వణికించారు. ఆరంభంలో పేసర్లు నవీన్ ఉల్ హక్ (2/47), అజ్మతుల్లా (2/52) కట్టుదిట్టమైన బౌలింగ్ దెబ్బకు కంగారూల టాప్ ఆర్డర్ రన్స్ చేయడానిని నానా తిప్పలు పడింది. రెండో ఓవర్‌లో హెడ్ (0) వికెట్ తీసిన నవీన్ స్వింగ్, బౌన్స్‌తో భయపెట్టాడు. ఆరో ఓవర్‌లో మార్ష్ (24)ను వెనక్కి పంపడంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టే భారం వార్నర్ (18), లబుషేన్ (14)పై పడింది. కానీ 9వ ఓవర్‌లో అజ్మతుల్లా డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. వరుస బాల్స్‌లో వార్నర్, జోష్ ఇంగ్లిస్ (0)ను ఔట్ చేశాడు. థర్డ్ బాల్‌కు మాక్స్‌వెల్‌ను దెబ్బకొట్టాడు. కానీ బాల్ బ్యాట్ అంచును తాకడంతో ఎల్బీ నుంచి తప్పించుకున్నాడు.
ఇక్కడి నుంచి మ్యాక్సీ ఆచితూచి ఆడితే.. రెండో ఎండ్‌లో మార్కస్ స్టోయినిస్ (6), మిచెల్ స్టార్క్ (3) నిరాశపర్చారు. ఫలితంగా ఆసీస్ 91/7తో ఎదురీత మొదలుపెట్టింది. కమిన్స్ అండతో మ్యాక్స్‌వెల్ టీ20 క్రికెట్ ఆడాడు. భారీ సిక్సర్లు బాదుతూ 76 బాల్స్‌లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత మరో 52 బాల్స్‌లో వంద కొట్టి కమిన్స్‌తో ఎనిమిదో వికెట్‌కు 202 రన్స్ జోడించి ఆసీస్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
సంక్షిప్త స్కోర్లు
అఫ్గానిస్తాన్ : 50 ఓవర్లలో 291/5 (ఇబ్రహీం జద్రాన్ 129*, రషీద్ 35*, హాజిల్‌వుడ్ 2/39).
ఆస్ట్రేలియా : 46.5 ఓవర్లలో 293/7 (మ్యాక్స్‌వెల్ 201*, రషీద్ 2/44).
అఫ్గాన్ క్వాలిఫై
ఆసీస్ చేతిలో ఓడిన అఫ్గానిస్తాన్ మరో ఘనతను సాధించింది. 2025 చాంపియన్స్ ట్రోఫీకి తొలిసారి అర్హత సాధించింది. సోమవారం బంగ్లాదేశ్ చేతిలో శ్రీలంక ఓటమితో అఫ్గాన్‌కు బెర్త్ ఖరారైంది. దీంతో 2017లో తృటిలో మిస్ అయిన ప్లేస్‌ను ఈసారి ఒడిసి పట్టుకుంది. చాంపియన్స్ ట్రోఫీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటాయి. ఇప్పటికి ఆరు జట్లు ఖరారయ్యాయి.