నేటి నుంచి ఇండో-ఆసీస్ క్రికెట్ వార్
కరోనా తర్వాత తొలిసారి ప్రేక్షకుల ముంగిట పోటీ
ఇరు జట్ల మధ్య నేడు తొలి వన్డే
ఉ. 9.10 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో
రిట్రో జెర్సీలో బరిలోకి ఇండియా
తొమ్మిది నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా తిరిగి ఇంటర్నేషనల్ క్రికెట్ బరిలోకి దిగుతోంది. మొన్నటిదాకా ఐపీఎల్‌లో రంగు రంగుల జెర్సీల్లో మెరిసిన ఇండియా ప్లేయర్లు మళ్లీ బ్లూ జెర్సీతో ‘నేషనల్ డ్యూటీ’కి రెడీ అయ్యారు. కొత్త క్రీడా ప్రపంచంలో.. 1992 వరల్డ్ కప్ నాటి రిట్రో జెర్సీల్లో ఫ్యాన్స్‌ను పలుకరించబోతున్నారు. కరోనా దెబ్బకు కొన్ని నెలలు పూర్తిగా ఆగిపోయి.. కొన్నాళ్లుగా ఖాళీ స్టేడియాల్లో నిశ్శబ్దంగా సాగుతున్న ఆటను తిరిగి సాధారణ స్థితికి తెచ్చేందుకు టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు నడుం బిగించాయి. కరోనా తర్వాత తొలిసారి ప్రేక్షకుల సమక్షంలో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ నేడే. రోహిత్ శర్మ గైర్హాజరీలో బలహీనంగా మారిన కోహ్లీసేన.. సొంతగడ్డపై అత్యంత బలంగా ఉండే ఆసీస్‌ను ఢీకొట్టనుంది. మరి, ప్రత్యర్థిని కంగారు పెడుతుందా? పడుతుందా? చూడాలి.
సిడ్నీ: ఓ వైపు ఇంటర్నేషనల్ క్రికెట్‌ను రీస్టార్ట్ చేస్తున్న ఉత్సాహం.. మరోవైపు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ లేక నిరుత్సాహం… ఇంకోవైపు కరోనా టైమ్‌లోనూ ఫ్యాన్స్ సమక్షంలో ఆడుతున్న ఆనందం. వీటి మధ్య ఆస్ట్రేలియాతో వన్డే వార్‌కు టీమిండియా రెడీ అయింది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో శుక్రవారం తొలి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లూ ఆశిస్తున్నాయి. రెండు నెలల టూర్ కోసం ఆసీస్ గడ్డపై అడుగుపెట్టి.. క్వారంటైన్‌లోనూ ప్రాక్టీస్ చేసిన కోహ్లీసేన ఈ పోరుకు అన్ని రకాలుగా సిద్ధమైంది. అయితే, గాయం కారణంగా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ లేకపోవడమే అతి పెద్ద లోటు. పైగా, చాన్నాళ్ల తర్వాత వన్డే ఫార్మాట్‌లో బరిలోకి దిగుతోంది. ఇంకోవైపు స్వదేశంలో ఆసీస్ ఎంత బలంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో, ఈ సిరీస్ కోహ్లీసేనకు అగ్ని పరీక్ష కానుంది. ఇక, ఇన్నాళ్లూ ఖాళీ స్టేడియాల్లో ఆడిన ఇరు జట్ల ఆటగాళ్లు ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య తలపడడం కాస్త కొత్తగా అనిపించనుంది. ఈ మ్యాచ్‌కు స్టేడియం కెపాసిటీలో యాభై శాతం ఫ్యాన్స్‌కు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వగా అన్ని టికెట్లూ సేల్ అయ్యాయి.
కాంబినేషన్ కుదిరితేనే..
ఆసీస్‌తో పోటీ అంటే ఎవ్వరైనా సరే అత్యుత్తమ టీమ్‌తో రావాల్సిందే. కానీ, తమ ప్రధాన ఆయుధమైన రోహిత్ శర్మ లేకుండానే ఇండియా బరిలోకి దిగుతోంది. ఆసీస్‌పై మెరుగైన రికార్డున్న రోహిత్ గైర్హాజరీ టాపార్డర్‌పై కచ్చితంగా ప్రభావం చూపనుంది. దాంతో పర్‌ఫెక్ట్ కాంబినేషన్‌ను వెతకడంలోనే జట్టుకు తొలి సవాల్ ఎదురవనుంది. రోహిత్ ప్లేస్ కోసం శుభ్‌మన్ గిల్, మయాంక్ మధ్య పోటీ ఉంది. అయితే, కాస్త అనుభవం ఉన్న మయాంక్.. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవన్‌తో ఇన్నింగ్స్ ఆరంభించే చాన్సుంది. ఐపీఎల్‌ఫామ్‌ను కొనసాగించి జట్టుకు మంచి ఆరంభం ఇవ్వాల్సిన బాధ్యత వీరిద్దరిపై ఉంది. కానీ, కొత్త బాల్‌తో ఆసీస్ పేస్ ద్వయం మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్‌ను ఎదుర్కోవడం అంత ఈజీ కాబోదు. దాంతో, వన్‌డౌన్‌లో కెప్టెన్ కోహ్లీ కీలకం కానున్నాడు. ఐపీఎల్‌లో ఓ మాదిరిగా ఆడిన విరాట్ వెంటనే టాప్ గేర్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. శ్రేయస్ అయ్యర్, కీపర్ లోకేశ్ రాహుల్, హార్దిక్ పాండ్యా మిడిలార్డర్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఐపీఎల్‌లో అదగరొట్టిన ముగ్గురూ ఫామ్‌లో ఉండడం జట్టుకు ప్లస్ పాయింట్. బ్యాక్ ఇంజ్యురీ దృష్ట్యా పాండ్యా స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గానే రానున్నాడు. నెట్స్‌లో కూడా అతను బౌలింగ్ చేసింది లేదు. ఆల్‌రౌండర్ కోటాలో జడేజా తుదిజట్టులో ఉంటే టాప్–7 వరకూ బ్యాటింగ్ బలంగానే ఉండనుంది. అప్పుడు సెకండ్ స్పిన్నర్ కోటా కోసం చహల్, కుల్దీప్ మధ్య పోటీ ఉంటుంది. ఐపీఎల్‌లో రాణించిన చహల్‌కే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. రొటేషన్ చేస్తామని మేనేజ్‌మెంట్ చెబుతున్నా ఈ మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ ఇద్దరూ పేస్ అటాక్‌ను నడిపించనున్నారు. థర్డ్ పేసర్‌గా శార్దుల్, సైనీలో ఎవరికి చాన్స్ ఇస్తారో చూడాలి. ఈ సిరీస్‌లో 1992 వరల్డ్‌కప్ జెర్సీతో ఇండియా ఆడనుంది. కానీ, ఆ మెగా టోర్నీ మన జట్టుకు ఓ చేదు జ్ఞాపకం. తొమ్మిది జట్లు పోటీ పడ్డ టోర్నీలో ఇండియా ఏడో ప్లేస్‌లో నిలిచింది. అయితే, రాబోయే రెండేళ్లూ వన్డే ఫార్మాట్ కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రికి అంత ఇంపార్టెంట్ కాదు. రెండు టీ20 వరల్డ్‌కప్స్, టెస్టు చాంపియన్‌షిప్ నెగ్గడంపై ఫోకస్ ఉంచారు. దాంతో, ఈ టూర్‌లో టెస్టులపై ప్రధానంగా దృష్టిపెట్టిన ఇండియన్స్.. వన్డేల్లో స్వేచ్ఛగా ఆడే చాన్సుంది. అది ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
ఆసీస్ బలంగా..
ఫార్మాట్ ఏదైనా ఆస్ట్రేలియాతో పోరు ఎప్పుడూ సవాలే. ఆసీస్‌ను వారి హోమ్‌గ్రౌండ్‌లో ఎదుర్కోవడం ఆషామాషీ కాదు. పైగా, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఐపీఎల్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. డేంజర్ మ్యాన్ డేవిడ్ వార్నర్ కూడా ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఫ్యూచర్ స్టార్‌గా భావిస్తున్న మార్నర్ లబుషేన్ రాకతో ఆసీస్ బలం మూడింతలు పెరిగింది. ఇక, ఐపీఎల్‌లో ఓ రేంజ్‌లో విజృంభించిన ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ రూపంలో టీమిండియాకు అతి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఆ మెగా టోర్నీలో నిరాశ పరిచిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ హోమ్‌గ్రౌండ్‌లో సత్తా చాటాలని చూస్తున్నాడు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఫామ్‌లో లేకపోయినా అతను టచ్‌లోకి వస్తే ఆపడం కష్టం. దాంతో, ఇండియా పేసర్లకు సవాల్ ఎదురవనుంది. పేసర్లు కమిన్స్, స్టార్క్, హేజిల్‌వుడ్‌తో పాటు రిస్ట్ స్పిన్నర్ ఆడమ్ జంపాతో కూడిన ఆసీస్ బౌలింగ్ అటాక్ కూడా దుర్భేద్యంగా ఉంది. కాబట్టి కోహ్లీసేన ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
విరాట్ కోహ్లీకి వన్డే ఫార్మాట్‌లో ఆసీస్ గడ్డపై మంచి రికార్డుంది. అక్కడ 50.17 యావరేజ్‌తో 1154 రన్స్ చేశాడు. అందులో ఐదు సెంచరీలున్నాయి. కానీ, సిడ్నీలో మాత్రంలో అతనిది పేలవ రికార్డు. ఇక్కడ ఐదు ఇన్నింగ్స్‌ల్లో కలిపి విరాట్ సగటు 9 మాత్రమే. హయ్యెస్ట్ స్కోరు 21.
ఎస్‌సీజీ గ్రౌండ్‌లో ఇండియాతో హెడ్ టు హెడ్‌లో ఆస్ట్రేలియా 14-2తో తిరుగులేని ఆధిపత్యంలో ఉంది.
ఆస్ట్రేలియాతో ఆడిన గత నాలుగు వన్డేల్లో ఇండియా మూడింటిలో నెగ్గింది.
ఆస్ట్రేలియాతో ఆడిన గత నాలుగు వన్డేల్లో ఇండియా మూడింటిలో నెగ్గింది.
జోన్స్‌కు నివాళి అర్పించనున్న ఆటగాళ్లు
ఈ మ్యాచ్‌లో ఇండియా, ఆస్ట్రేలియా ప్లేయర్లు బ్లాక్ ఆర్మ్ బాండ్స్ ధరించనున్నారు. సెప్టెంబర్‌లో మృతి చెందిన ఆసీస్ మాజీ ప్లేయర్, కామెంటేటర్ డీన్ జోన్స్‌కు నివాళిగా మ్యాచ్‌కు ముందు ఒక నిమిషం మౌనం కూడా వహిస్తారు. జోన్స్ కెరీర్‌కు సంబంధించిన హైలైట్స్‌ను స్టేడియంలోని పెద్ద స్క్రీన్‌పై ప్రదర్శిస్తారు.
పిచ్/ వాతావరణం
ఎస్‌సీజీ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలం. భారీ స్కోర్లు ఆశించొచ్చు. ఈ గ్రౌండ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లు గత ఏడు వన్డేల్లో ఆరింటిలో నెగ్గాయి. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు 312. కాబట్టి టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్‌కే మొగ్గు చూపొచ్చు. మ్యాచ్‌కు వర్ష సూచన లేదు. వాతావరణం కాస్త వేడిగా ఉండనుంది.
జట్లు (అంచనా)
ఇండియా: శిఖర్ధవన్, మయాంక్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అయ్యర్, రాహుల్ (కీపర్), హార్దిక్, జడేజా, శార్దూల్/సైనీ, చహల్/కుల్దీప్, షమీ, బుమ్రా.
ఆస్ట్రేలియా: వార్నర్, ఫించ్ (కెప్టెన్), స్మిత్, లబుషేన్, స్టోయినిస్, క్యారీ (కీపర్), మ్యాక్స్‌వెల్, కమిన్స్, స్టార్క్, జంపా, హేజిల్‌వుడ్.