
ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్ కు వెళ్లే జట్లు ఏవో తేలిపోయాయి. గ్రూప్ ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీస్ కు చేరుకోగా.. గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. సౌతాఫ్రికా కూడా దాదాపుగా సెమీ ఫైనల్ కు అర్హత సాధించింది. శనివారం (మార్చి 1) ఇంగ్లాండ్, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలిస్తే నేరుగా సెమీస్ కు అర్హత సాధిస్తుంది. ఇంగ్లాండ్ తో 207 పరుగుల భారీ తేడాతో ఓడిపోతే సౌతాఫ్రికా ఇంటిదారి పడుతుంది. కానీ ఇది జరగడం దాదాపుగా అసాధ్యం. దీంతో గ్రూప్ బి లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్ కు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
ఆస్ట్రేలియాతో భారత్ సెమీ ఫైనల్ ఫైట్:
ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న సౌతాఫ్రికా చివరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై గెలవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఇంగ్లాండ్ తీవ్ర ఒత్తిడిలో ఉంటే సౌతాఫ్రికా అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది. దీంతో ఈ మ్యాచ్ లో సఫారీలు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే 5 పాయింట్లతో గ్రూప్ బి లో సౌతాఫ్రికా అగ్ర స్థానంలోకి నిలుస్తుంది. 4 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానానికిపరిమితమవుతుంది.
గ్రూప్ ఏ లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం (మార్చి 2) చివరి లీగ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు టాప్ లో నిలుస్తుంది. ప్రస్తుతం టీమిండియా జోరును చూస్తుంటే మన జట్టును కివీస్ ఆపడం కష్టం. పైగా దుబాయ్ పిచ్.. అక్కడ వాతావరణానికి కు బాగా అలవాటు పడిన రోహిత్ సేనకు ఇది అనుకూలంగా మారనుంది. గ్రూప్ ఏ లో భారత్ అగ్రస్థానంలో నిలిస్తే.. గ్రూప్ బి లో రెండో స్థానంలో ఉన్న జట్టుతో సెమీస్ చేరుతుంది. గ్రూప్ బి లో ఆస్ట్రేలియాకే రెండో స్థానంలో నిలిచే ఛాన్స్ ఉంది. దీని ప్రకారం ఇండియా, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్లో తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్, సౌతాఫ్రికా ఆడొచ్చు.