Champions Trophy 2025: అటల్, ఒమర్జాయ్ మెరుపులు.. ఆస్ట్రేలియా ముందు ఛాలెంజింగ్ టార్గెట్

Champions Trophy 2025: అటల్, ఒమర్జాయ్ మెరుపులు.. ఆస్ట్రేలియా ముందు ఛాలెంజింగ్ టార్గెట్

ఛాంపియన్స్ ట్రోఫీ కీలక మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు బ్యాటింగ్ లో పర్వాలేదనిపించింది. లాహోర్ వేదికగా ఆస్ట్రేలియాపై జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టుకు ఛాలెంజింగ్ టార్గెట్ సెట్ చేసింది. టాపార్డర్ లో సెదికుల్లా అటల్ (85), మిడిల్ ఆర్డర్ లో అజ్మతుల్లా ఒమర్జాయ్ (70) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా సెమీ ఫైనల్ కు చేరుతుంది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. ఎప్పటిలాగే గర్భాజ్ తక్కువ స్కోర్ కే ఔటయ్యాడు. పేలవ ఫామ్ లో ఉన్న ఈ ఆఫ్గన్ ఓపెనర్.. స్పెన్సర్ జాన్సన్ వేసిన ఒక అద్భుతమైన బంతికి బౌల్డయ్యాడు. ఈ దశలో అటల్, ఇబ్రహీం జద్రాన్ (22) రెండో వికెట్ కు 67 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూ వస్తుంది. రహ్మత్ షా (12), కెప్టెన్ షాహిద్ (20), నబీ (1),నాయబ్ (4) తక్కువ స్కోర్ కే ఔటయ్యారు. ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నప్పటికీ మరో ఎండ్ లో అటల్ అద్భుతంగా రాణించాడు.

ALSO READ : Mitchell Starc: ఆ ఒక్క కారణంతోనే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నా: మిచెల్ స్టార్క్

95 బంతుల్లో 6 ఫోర్లు.. 3 సిక్సర్లతో 85 పరుగులు చేసి జట్టును నిలబెట్టాడు. అటల్ ఔట్ కావడంతో జట్టును ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఓమర్జాయ్ తీసుకున్నాడు. 199 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతో కష్టాల్లో పడినప్పుడు జట్టును ఆదుకున్నాడు. 63 బంతుల్లో 67 పరుగులు చేసి జట్టు స్కోర్ ను 273 పరుగులకు చేర్చాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్ మూడు వికెట్లు పడగొట్టాడు. స్పెన్సర్ జాన్సన్, ఆడం జంపా తలో రెండు వికెట్లు తీసుకున్నారు. ఎల్లిస్, మ్యాక్స్ వెల్ లకు తలో వికెట్ లభించింది.