- మ్యాక్స్‌వెల్, వార్నర్ సెంచరీలు
- రాణించిన స్మిత్, లబుషేన్, జంపా
- నెదర్లాండ్స్ ఫ్లాప్ షో
న్యూఢిల్లీ: వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా తన బ్యాటింగ్ పవర్ చూపెట్టింది. డేవిడ్ వార్నర్ (93 బాల్స్‌లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 104), మ్యాక్స్‌వెల్ (44 బాల్స్‌లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో 106) రన్స్ సునామీ సృష్టించడంతో.. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆసీస్ 309 రన్స్ భారీ తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. వరల్డ్ కప్ హిస్టరీలో రన్స్ పరంగా ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఓవరాల్‌గా వన్డే ఫార్మాట్‌లో మాత్రం రెండో అతి పెద్ద విక్టరీ.
ఈ ఏడాది ఆరంభంలో ఇండియా 317 రన్స్ తేడాతో శ్రీలంకపై నెగ్గిన రికార్డు టాప్‌లో ఉంది. తాజా విజయంతో 2015 వరల్డ్ కప్‌లో అఫ్గానిస్తాన్‌పై సాధించిన 217 రన్స్ విక్టరీని ఆసీస్ సవరించుకుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 399/8 స్కోరు చేసింది. స్మిత్ (71), లబుషేన్ (62) రాణించారు. తర్వాత నెదర్లాండ్స్ 21 ఓవర్లలో 90 రన్స్‌కే ఆలౌటైంది. విక్రమ్‌జిత్ సింగ్ (25) టాప్ స్కోరర్. తేజ నిడమనూర్ (14), స్కాట్ ఎడ్వర్డ్స్ (12 నాటౌట్), అకెర్‌మన్ (10), సైబ్రాండ్ (11)తో సహా అందరూ ఫెయిలయ్యారు. ఇన్నింగ్స్ మొత్తంలో ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. జంపా 4 వికెట్లతో డచ్ బ్యాటింగ్‌ను పేకమేడలా కూల్చాడు. మ్యాక్స్‌వెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
పరుగుల జాతర..
బ్యాటింగ్ పిచ్‌పై రెండు ఎండ్‌ల నుంచి ఇద్దరు స్పిన్నర్లతో బౌలింగ్ చేయించిన డచ్ కెప్టెన్ నిర్ణయం ఘోరంగా బెడిసి కొట్టింది. ఫోర్త్ ఓవర్‌లో మిచెల్ మార్ష్ (9) ఔటైనా, ఆ తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరు భారీ షాట్లతో రెచ్చిపోయారు. ఆరంభంలో రనౌట్ నుంచి బయటపడ్డ వార్నర్.. డచ్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. ఏడో ఓవర్‌లో రెండు ఫోర్లతో టచ్‌లోకి వచ్చిన స్మిత్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో పరుగులు వరదలా వచ్చాయి. విక్రమ్‌జిత్ ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లతో 40 బాల్స్‌లో ఫిఫ్టీ కంప్లీట్ చేసిన వార్నర్ టీమ్ స్కోరును వందకు చేర్చాడు. 20వ ఓవర్‌లో స్మిత్ కూడా హాఫ్ సెంచరీ (53 బాల్స్) పూర్తి చేశాడు. 23వ ఓవర్‌లో స్మిత్ 6, 4 బాదితే, వార్నర్ ఫుల్ షాట్ బౌండ్రీ కొట్టగా, లైన్ వద్ద వాన్ డెర్ మెర్వ్ దాన్ని అందుకున్నాడు.
అయితే రీప్లేలో బాల్ నేలకు తాకిందని తేలడంతో డేవిడ్ ఊపిరి పీల్చుకున్నాడు. చివరకు 24వ ఓవర్‌లో స్మిత్‌ను ఔట్ చేసి రెండో వికెట్‌కు 132 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌కు అర్యన్ దత్ (1/59) ముగింపు పలికాడు. తర్వాత వచ్చిన లబుషేన్ కూడా వార్నర్‌కు అండగా నిలిచాడు. ఇద్దరు కలిసి లాంగాన్, లాంగాఫ్, మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్లు కొట్టి మూడో వికెట్‌కు 84 రన్స్ జోడించారు. అయితే డి లీడె (2/115) తన వరుస ఓవర్ల (37, 39వ)లో లబుషేన్, జోష్ ఇంగ్లిస్ (14)ను,40వ ఓవర్‌లో వాన్ బీక్ (4/74).. వార్నర్‌కు పెవిలియన్‌కు పంపాడు.
దీంతో 19 బాల్స్ తేడాలో మూడు కీలక వికెట్లు పడటంతో ఆసీస్ స్కోరు 244/2 నుంచి 267/5గా మారింది. ఈ దశలో వచ్చిన మ్యాక్స్‌వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఎదుర్కొన్న ప్రతీ బాల్‌ను బౌండ్రీ లైన్ దాటిస్తూ ఫోర్లు, సిక్సర్ల జాతర చూపెట్టాడు. ఫలితంగా 27 బాల్స్‌లో తొలి ఫిఫ్టీ, 13 బాల్స్‌లో రెండో ఫిఫ్టీ బాదాడు. ఓవరాల్‌గా 40 బాల్స్‌లోనే సెంచరీ దంచాడు. గ్రీన్ (8), స్టార్క్ (0) నిరాశపర్చినా.. చివరి 10 ఓవర్లలో 131 రన్స్ రావడంతో ఆసీస్ భారీ టార్గెట్ నిర్దేశించింది.
వరల్డ్ కప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన తొలి ప్లేయర్ మ్యాక్స్‌వెల్ (40 బాల్స్). మార్‌క్రమ్ (43 బాల్స్)ను అధిగమించాడు. ఓవరాల్‌గా వన్డే ఫార్మాట్‌లో ఇది నాలుగో ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం.
వరుసగా రెండేసి సెంచరీలు చేసిన నాలుగో ఆసీస్ ప్లేయర్ వార్నర్. మార్క్ వా (1996), పాంటింగ్ (2003-07), మాథ్యూ హెడన్ (2007) ముందున్నారు.
వన్డే వరల్డ్ కప్‌లో వార్నర్‌కు ఇది ఆరో సెంచరీ. సచిన్ రికార్డు (6)ను సమం చేశాడు. రోహిత్ (7) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.