Champions Trophy: పాక్‌లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా జట్టు.. 200 మంది పోలీసులతో భద్రత

Champions Trophy: పాక్‌లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా జట్టు.. 200 మంది పోలీసులతో భద్రత

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టు సోమవారం(ఫిబ్రవరి 17) పాకిస్తాన్ చేరుకుంది. వారి తొలి మ్యాచ్ లాహోర్‌లో జరగనుండటంతో.. ఆస్ట్రేలియన్లు నేరుగా  అక్కడే ల్యాండ్ అయ్యారు. కెప్టెన్ స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్, సీన్ అబోట్ సహా ఆటగాళ్లు, కోచ్‌లు, సిబ్బంది లాహోర్ ఎయిర్‌పోర్టు నుండి హోటల్‍కి వెళ్తున్న దృశ్యాలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో పంచుకుంది.    

టెర్రరిస్టుల భయం.. భారీ భద్రత

ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యాన్ని ఓ సవాల్‍గా తీసుకున్న పాక్ క్రికెట్ బోర్డు(PCB) ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. తమ దేశానికి వస్తున్న జట్లకు భారీ భద్రత కల్పిస్తోంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు లాహోర్ ఎయిర్‌పోర్టులో ల్యాండైన దగ్గర నుంచి హోటల్‌కి చేరుకునేవరకు దాదాపు 200 మంది పోలీసులు వారికి భద్రత కల్పించారని ఆ దేశ మీడియా పేర్కొంది. ఈ విషయాన్ని వారు ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నారు.

శ్రీలంక జట్టుపై కాల్పులు

2009 పాకిస్తాన్ పర్యటనలో శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టుపై కాల్పులు జరిగాయి. శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై లాహోర్‌లోని గడాఫీ స్టేడియం సమీపంలో 12 మంది ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కెప్టెన్ మహేల జయవర్ధనే, డిప్యూటీ కుమార్ సంగక్కర సహా ఐదుగురు క్రికెటర్లకు గాయాలు కాగా.. ఆరుగురు పాకిస్తాన్ పోలీసులు, ఇద్దరు పౌరులు మరణించారు. 

అటువంటి ఘటనలు మరోసారి పునరావృతం అయితే.. పాకిస్థాన్ క్రికెట్ ఆతిథ్యం గురించి మర్చిపోవలసిందే. ఈ క్రమంలోనే పాక్ క్రికెట్ బోర్డు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. లాహోర్, రావల్పిండి నగరాల్లో 12,000 మందికి పైగా పోలీసులను మోహరించనునున్నారు. 

ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత జట్టు ఫిబ్రవరి 20న తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుండగా.. ఫిబ్రవరి 23న దాయాది పాకిస్థాన్‌తో తాడో పేడో తేల్చుకోనుంది.