
రావాల్పిండి: బ్యాటింగ్, బౌలింగ్ బలగం సరిసమానంగా ఉన్న ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య కీలక పోరుకు సమయం ఆసన్నమైంది. చాంపియన్స్ ట్రోఫీలో మంగళవారం జరిగే గ్రూప్–బి రెండో లీగ్ మ్యాచ్‌లో ఇరుజట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇందులో నెగ్గే జట్టు సెమీఫైనల్ బెర్తు ఖాయం చేసుకోనుంది. కీలక ప్లేయర్లు లేకుండా బరిలోకి దిగిన ఆసీస్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై రికార్డ్ ఛేజింగ్‌తో దుమ్మురేపింది. బ్యాటింగ్‌లో ఇంగ్లిస్ సెంచరీతో ఫామ్‌లో రావడం శుభసూచకం. షార్ట్, లబుషేన్, క్యారీ, మ్యాక్స్‌వెల్ మళ్లీ బ్యాట్లు ఝుళిపించేందుకు రెడీగా ఉన్నారు. కెప్టెన్ స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ ఫామ్‌లో లేకపోవడం ఒక్కటే ఆసీస్‌కు ఆందోళనగా మారింది.
పేస్ త్రయం కమిన్స్, స్టార్క్, హేజిల్‌వుడ్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌లో పేసర్ స్పెన్సర్ జాన్సన్, మ్యాక్స్‌వెల్ ధారాళంగా రన్స్ ఇచ్చుకున్నారు. ఆరో బౌలర్ కోటాను లబుషేన్, షార్ట్ పంచుకోవడం కలిసొచ్చే అంశం. మరోవైపు సౌతాఫ్రికా కూడా మంచి జోరుమీద ఉంది. తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై రికెల్టన్ సెంచరీ చేయడంతో టీమ్‌లో కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. గాయంతో తొలి మ్యాచ్‌కు దూరమైన క్లాసెన్ ఈ పోరులో ఆడే విషయంపై క్లారిటీ లేదు. ప్రస్తుతం ఉన్న ఆసీస్ పేస్ బలగంతో పోలిస్తే సఫారీల బలం ఎక్కువగా ఉంది. రబాడ, యాన్సెన్, ముల్డర్ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు.