బ్రిడ్జ్‌టౌన్ (బార్బడోస్) : టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా బోణీ చేసింది. మార్కస్ స్టోయినిస్ (55 బాల్స్‌లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 67 నాటౌట్, 3/19) ఆల్‌రౌండ్ షోతో చెలరేగడంతో.. గురువారం జరిగిన గ్రూప్–బి లీగ్ మ్యాచ్‌లో ఆసీస్ 39 రన్స్ తేడాతో ఒమన్‌పై గెలిచింది. టాస్ ఓడిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 164/5 స్కోరు చేసింది. డేవిడ్ వార్నర్ (51 బాల్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 56) నిలకడగా ఆడినా ట్రావిస్ హెడ్ (12), కెప్టెన్ మిచెల్ మార్ష్ (14), మ్యాక్స్‌వెల్ (0) ఫెయిలయ్యారు. దీంతో 50 రన్స్‌కే మూడు కీలక వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను స్టోయినిస్ ఆదుకున్నాడు.
వార్నర్‌తో కలిసి ఒమన్ బౌలర్లపై భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా నాలుగో వికెట్‌కు 100 రన్స్ జత చేసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. చివర్లో వార్నర్ ఔటైనా, టిమ్ డేవిడ్ (9) వేగంగా ఆడాడు. ఒమన్ బౌలర్లలో మెహ్రాన్ ఖాన్ 2 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఒమన్ 20 ఓవర్లలో 125/9 స్కోరుకే పరిమితమైంది. అయాన్ ఖాన్ (36) టాప్ స్కోరర్. మెహ్రాన్ ఖాన్ (27), అఖీబ్ ఇలియాస్ (18), షకీల్ అహ్మద్ (11) ఓ మాదిరిగా ఆడారు. ఆసీస్ బౌలర్ల ధాటికి ఒమన్ ఇన్నింగ్స్‌లో ఇద్దరు డకౌట్ కాగా, ఐదుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. స్టార్క్, నేథన్ ఎలిస్, జంపా తలా రెండు వికెట్లు తీశారు. స్టోయినిస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ఉగాండా శుభారంభం..
బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన ఉగాండా.. టీ20 వరల్డ్ కప్‌లో శుభారంభం చేసింది. ఛేజింగ్‌లో రియాజత్ అలీ షా (33) మెరుగ్గా ఆడటంతో.. గురువారం జరిగిన గ్రూప్–సి లీగ్ మ్యాచ్‌లో ఉగాండా 3 వికెట్ల తేడాతో పపువా న్యూగినియాను ఓడించింది. టాస్ ఓడిన గినియా 19.1 ఓవర్లలో 77 రన్స్‌కే ఆలౌటైంది. హిరిహిరి (15) టాప్ స్కోరర్. లీగా సియాకా (12), కిప్లిన్ డోరిగా (12)తో సహా మిగతా వారందరూ విఫలమయ్యారు.
ఉగాండా బౌలర్లలో అల్పేష్ రమ్జాని, కోస్మాస్, జుమా తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత ఉగాండా 18.2 ఓవర్లలో 78/7 స్కోరు చేసి నెగ్గింది. 6 రన్స్‌కే రోజర్ ముకాసా (0), సిమోన్ (1), రాబిన్సన్ ఒబుయా (1) ఔటయ్యారు. ఈ దశలో రియాజత్ అలీ నిలకడగా ఆడాడు. జుమా మియాగి (13)తో కలిసి కీలక రన్స్ జత చేసి గెలిపించాడు. అలీ నావో, నోర్మన్ వనువా చెరో రెండు వికెట్లు తీశారు. రియాజత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.