INDW vs AUSW: హ్యాట్రిక్ ఓటములు.. ఒట్టి చేతులతో స్వదేశానికి భారత మహిళలు

INDW vs AUSW: హ్యాట్రిక్ ఓటములు.. ఒట్టి చేతులతో స్వదేశానికి భారత మహిళలు

సొంతగడ్డపై కంగారూలను మట్టికరిపించి సిరీస్ చేజిక్కించుకోవాలనుకున్న భారత మహిళలకు నిరాశ ఎదురైంది. స్వదేశీ పిచ్‌లపై పులుల్లా విజృంభించే భారత వనితలు ఆసీస్ గడ్డపై పిల్లుల్లా మారిపోయారు. ఆడాం.. ఓడాం అన్నట్లుగా భారత మహిళా జట్టు పర్యటన సాగింది.

బుధవారం (డిసెంబర్ 11) జరిగిన ఆఖరి వన్డేలో హర్మన్ సేన 83 పరుగుల తేడాతో చిత్తయ్యింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 298 పరుగులు చేసింది. 78 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి  కష్టాల్లో పడిన ఆసీస్‌ను అన్నాబెల్ సదర్లాండ్ ఆదుకుంది. 95 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసింది. అన్నాకు తోడుగా తహ్లియా మెక్‌గ్రాత్(56 నాటౌట్), ఆష్లీ గార్డనర్(50) రాణించారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి 4 వికెట్లతో అలరించింది. 

మంధాన శతకం

భారీ ఛేదనలో భారత ఓపెనర్ స్మృతి మంధాన(105) సెంచరీ చేసినప్పటికీ, జట్టును గెలిపించలేకపోయింది. హర్లీన్ డియోల్(39), రిచా ఘోష్ (2),  హర్మన్‌ప్రీత్ కౌర్(12), జెమిమా రోడ్రిగ్స్(8) పరుగులు చేశారు. ఒకానొక సమయంలో భారత్ 189/3తో విజయం దిశగా సాగేలా అనిపించినా.. మంధాన వెనుదిరగడంతో భారత ఇన్నింగ్స్ కుప్పకూలింది. 16 పరుగులు వ్యవధిలో చివరి 6 వికెట్లు కోల్పోయింది.

ALSO READ | Smriti Mandhana: ఏడాదిలో నాలుగోది.. ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పిన మంధాన

మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసీస్ మహిళలు 3-0 తేడాతో సొంతం చేసుకున్నారు.