AUS vs IND: 100 పరుగులకే ఆలౌట్: ఆస్ట్రేలియా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిన భారత మహిళలు

మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత మహిళల జట్టుకు తొలి మ్యాచ్ లోనే బిగ్ షాక్ తగిలింది. కనీసం పోటీ ఇవ్వకుండానే ఆతిధ్య ఆసీస్ జట్టుకు దాసోహమన్నది.  గురువారం(డిసెంబర్ 5) బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో భారత మహిళలపై ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం 100 పరుగులకే ఆలౌటైంది. 23 పరుగులు చేసిన జెమిమా రోడ్రిగ్స్ టాప్ స్కోరర్ గా నిలిచింది. వచ్చినవారు వచ్చినట్టు పరుగులు చేయడంలో తడబడ్డారు. కనీసం క్రీజ్ లో నిలదొక్కునేందుకు కూడా ఎవరూ ప్రయత్నించలేదు. అనుభవం ఉన్న ప్లేయర్లు స్మృతి మందాన (8), హర్మన్ ప్రీత్ కౌర్ (17) సైతం విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఫాస్ట్ బౌలర్ మెగా స్కట్చ్ 5 వికెట్లతో భారత పతనాన్ని శాసించింది. 

కిమ్ గార్త్, గార్డనర్, ఆలన కింగ్, సదర్లాండ్ తలో వికెట్ తీసుకున్నారు. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 16.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసి గెలిచింది. భారత బౌలర్లలో రేణుక ఠాకూర్ మూడు వికెట్లుయ్ ప్రియా పూనియా రెండు వికెట్లు తీసుకొని రాణించినా లక్ష్యం మరీ చిన్నది కావడంతో ఆసీస్ ఈజీగా గెలిచింది.