నార్త్ సౌండ్ (అంటిగ్వా): స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ (3/29) హ్యాట్రిక్ నమోదు చేయడంతో టీ20 వరల్డ్ కప్ సూపర్–8 రౌండ్‌లో ఆస్ట్రేలియా బోణీ చేసింది. ఛేజింగ్‌లో డేవిడ్ వార్నర్ (35 బాల్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 నాటౌట్), ట్రావిస్ హెడ్ (21 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31) చెలరేగడంతో.. శుక్రవారం వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో ఆసీస్ డక్ వర్త్ పద్ధతిలో 28 రన్స్ తేడాతో బంగ్లాదేశ్‌పై గెలిచింది. టాస్ ఓడిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 140/8 స్కోరు చేసింది. నజ్ముల్ హుస్సేన్ (36 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 41), తౌహిద్ హృదయ్ (28 బాల్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40) మినహా మిగతా వారు నిరాశపర్చారు.
ఇన్నింగ్స్ మూడో బాల్‌కే తంజిద్ హసన్ (0)ను డకౌట్ చేసి స్టార్క్ (1/21) ఇచ్చిన శుభారంభాన్ని మిగతా బౌలర్లు కొనసాగించారు. లిటన్ దాస్ (16) , రిషద్ హుస్సేన్ (2), షకీబ్ (8) ఫెయిలయ్యారు. 18 ఓవర్ చివరి రెండు బాల్స్‌లో మహ్ముదుల్లా (2), మెహిదీ హసన్ (0)ను ఔట్ చేసిన కమిన్స్ ఆఖరి ఓవర్ ఫస్ట్ బాల్‌కు తౌహిద్‌ను పెవిలియన్‌కు పంపి హ్యాట్రిక్ సాధించాడు. కమిన్స్ కెరీర్‌లో ఇది తొలి హ్యాట్రిక్ కాగా, టీ20 వరల్డ్ కప్స్‌లో ఇది ఏడోది. అనంతరం ఛేజింగ్‌లో ఆస్ట్రేలియా 11.2 ఓవర్లలో 100/2 స్కోరుతో నిలిచిన దశలో వర్షంతో మ్యాచ్ ఆగింది. డక్‌వర్త్ ప్రకారం అప్పటికి 28 రన్స్ ఆధిక్యంలో ఉన్న ఆసీస్‌ను విన్నర్‌గా ప్రకటించారు.
ఓపెనర్లు వార్నర్, హెడ్ ధనాధన్ బ్యాటింగ్‌తో పవర్‌ప్లేలోనే 59/0 స్కోరు చేసింది. కానీ ఏడో ఓవర్‌లో వర్షం పడటంతో ఇన్నింగ్స్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది. మళ్లీ ఆట మొదలైన తర్వాత ఆసీస్ వరుస విరామాల్లో హెడ్, మిచెల్ మార్ష్ (1) వికెట్లను కోల్పోయింది. మ్యాక్స్‌వెల్ (14 నాటౌట్) తోడుగా వార్నర్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లినా 12వ ఓవర్‌లో మరోసారి భారీ వర్షం కురవడంతో ఆట పూర్తిగా ఆగిపోయింది. కమిన్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.