వార్నర్‌‌‌‌ ఆట ముగిసింది..ఇండియాతో మ్యాచే ఆఖరిది

వార్నర్‌‌‌‌ ఆట ముగిసింది..ఇండియాతో మ్యాచే ఆఖరిది
  • ఇంటర్నేషనల్ క్రికెట్ అన్ని ఫార్మాట్లనుంచి తప్పుకున్న డేవిడ్‌‌‌

కింగ్స్‌‌‌‌టౌన్‌‌‌‌ : ఆస్ట్రేలియా బ్యాటింగ్‌‌‌‌ లెజెండ్‌‌‌‌ డేవిడ్‌‌‌‌ వార్నర్‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ కెరీర్‌‌‌‌ను ముగించాడు.  జనవరి 2023లో చివరి టెస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ ఆడిన వార్నర్‌‌‌‌ నవంబర్‌‌‌‌లో జరిగిన వరల్డ్ కప్‌‌‌‌లో ఇండియాపై చివరి వన్డే ఆడేశాడు. తాజాగా ఇండియాపైనే టీ20 మ్యాచ్‌‌‌‌తో కెరీర్‌‌‌‌ ముగించాడు. మంగళవారం బంగ్లాదేశ్‌‌‌‌పై అఫ్గానిస్తాన్‌‌‌‌ గెలవడంతో ఆసీస్‌‌‌‌ సెమీస్‌‌‌‌ చేరకుండానే ఇంటిముఖం పట్టడంతో వార్నర్‌‌‌‌కు వీడ్కోలు మ్యాచ్‌‌‌‌ లేకుండా పోయింది. దీంతో  గార్డ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ హానర్‌‌‌‌, స్టాండింగ్‌‌‌‌ ఒవేషన్‌‌‌‌, ఫ్యామిలీ సెలబ్రేషన్స్‌‌‌‌లాంటి హడావుడి లేకుండానే ఈ లెఫ్టాండర్‌‌‌‌ ఆటను వదిలేశాడు.

తన కెరీర్లో 112 టెస్టులు ఆడిన అతను 8,786 రన్స్‌‌‌‌ చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 37 ఫిఫ్టీలు ఉన్నాయి. ఇక 161 వన్డేల్లో 22 సెంచరీలు, 33 హాఫ్‌‌‌‌ సెంచరీలతో 6,932 రన్స్‌‌‌‌ సాధించాడు. 110 టీ20ల్లో 3,227 రన్స్‌‌‌‌ చేశాడు. ఒక సెంచరీ, 28 హాఫ్‌‌‌‌ సెంచరీలు ఉన్నాయి. ఈ ఫార్మాట్‌‌‌‌లో అత్యధిక రన్స్‌‌‌‌ చేసిన తొలి ఆసీస్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌గా నిలిచాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 49 సెంచరీలు బాదిన వార్నర్‌‌‌‌ కెరీర్‌‌‌‌ మొత్తంలో 19 వేల రన్స్‌‌‌‌చేశాడు.

సాండ్‌‌‌‌ పేపర్‌‌‌‌ స్కాండల్‌‌‌‌..

15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌‌‌‌లో వార్నర్‌‌‌‌ తన పవర్‌‌‌‌ హిట్టింగ్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌తో ఎన్ని ఘనతలు సాధించాడో.. అదే స్థాయిలో వివాదాలు కూడా ఉన్నాయి.  2018లో సౌతాఫ్రికాతో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌‌‌‌లో సాండ్‌‌‌‌ పేపర్‌‌‌‌ స్కాండల్‌‌‌‌తో ఏడాది పాటు నిషేధం కూడా ఎదుర్కొన్నాడు. అదే టైమ్‌‌‌‌లో ఆస్ట్రేలియన్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో ఎలాంటి కెప్టెన్సీ చేపట్టకుండా అతనిపై లైఫ్‌‌‌‌ బ్యాన్‌‌‌‌ విధించారు. 2014 నుంచి 2021 వరకు ఐపీఎల్‌‌‌‌లో సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌కు ఆడిన వార్నర్‌‌‌‌.. 2016లో టైటిల్‌‌‌‌ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు.