క్రికెట్‌లో ఎప్పుడూ బ్యాటర్లదే ఆధిపత్యం. అందుకే మనం యువరాజ్ సింగ్ సిక్సర్ల గురుంచి, సచిన్ టెండూల్కర్ సెంచరీల గురుంచి కథలు కథలుగా చెప్పుకుంటాం. ఏనాడైనా బౌలర్ల గణాంకాలను పొగిడిన రోజులున్నాయా! ఒకవేళ పొగిడినా ఆ జ్ఞాపకాలు ఓ గంట మాత్రమే. అందుకే ఓ ఆసీస్ క్లబ్ క్రికెటర్ తన పేరును క్రికెట్ బ్రతుకున్న అన్ని రోజులు గుర్తుంచుకునేలా చేశాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే గోల్డ్ కోస్ట్ ప్రీమియర్ లీగ్ డివిజన్ క్రికెట్‌లో ఈ రికార్డు నమోదయ్యింది.
విజయానికి చివరి 6 బంతుల్లో 5 పరుగులు.. చేతిలో 6 వికెట్లు. ఆ సమయంలో ఎవరైనా ఛేజింగ్ జట్టుదే విజయం అనుకుంటారు. పోనీ ఫలితం తారుమారైనా 6 బంతుల్లో 6 వికెట్లు అన్నది కలలో కూడా ఊహించం. ఆసీస్ క్లబ్ క్రికెటర్ గారెత్ మోర్గాన్ దాన్ని సుసాధ్యం చేశాడు. సర్ఫర్స్ ప్యారడైతో జరిగిన మ్యాచ్‌లో ముద్గీరబా నెరంగ్ కెప్టెన్ గారెత్ మోర్గాన్ 6 బంతుల్లో 6 వికెట్లు తీసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 143 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే ఎవరూ అందుకోని ఘనతను సొంతం చేసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముద్గీరబ నేరంగ్ నిర్ణీత 40 ఓవర్లలో 177 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సర్ఫర్స్ ప్యారడైజ్ జట్టు 39 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లకు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్‌లో ఆ జట్టు విజయానికి 4 పరుగులు అవసరం కాగా, చివరి ఓవర్ వేసిన గారెత్ మోర్గాన్ ఫలితాన్ని తారుమారు చేశాడు. ఆశ్చర్యకర రీతిలో వరుసగా ఆరు బంతుల్లో 6 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టుకు పీడకలను మిగిల్చాడు. ఈ ఆరు వికెట్లలో నలుగురు క్యాచ్ అవుట్ కాగా.. మరో ఇద్దరు బౌల్డ్ అయ్యారు.
Imagine the chaos in the sheds!
— PlayCricket AU (@PlayCricketAU) November 12, 2023
Gareth Morgan took six-in-six for Mudgeeraba to claim one of the most unlikely victories OF ALL TIME ? pic.twitter.com/RCRCV1esH2
లసిత్ మలింగ
దేశవాళీ క్రికెట్‌లో అయినా, అంతర్జాతీయ క్రికెట్‌లో అయినా ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీసిన సందర్భాలు లేవు. దేశవాళీ క్రికెట్‌లో ఒక ఓవర్‌లో ఐదు వికెట్లు తీయడమే ఇప్పటి వరకూ అత్యధికం. న్యూజిలాండ్‌కు చెందిన నీల్ వాగ్నర్ (2011), బంగ్లాదేశ్‌కు చెందిన అల్-అమిన్ హొస్సేన్ (2013), మరియు భారత్‌కు చెందిన అభిమన్యు మిథున్ (2019) ఒక ఓవర్‌లో ఐదు వికెట్లు తీశారు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం 4 బంతుల్లో 4 వికెట్లు తీయడమే అత్యధికం. శ్రీలంక దిగ్గజ పేసర్ లసిత్ మలింగ 2007 ప్రపంచ కప్ లో దక్షణాఫ్రికాపై ఈ ఫీట్ సాధించాడు. ఒక ఓవర్ చివరి రెండు బంతులకు రెండు వికెట్లు తీసిన మలింగ.. తన తదుపరి ఓవర్ మొదటి రెండు బంతులకు రెండు వికెట్లు తీశాడు.