- నేటి నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్
- బరిలో తెలంగాణ కుర్రాడు రిత్విక్
మెల్‌బోర్న్: సీజన్ తొలి టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌షిప్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం మొదలయ్యే మెగా టోర్నీలో గెలిచి 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ఖాతాలో వేసుకోవాలని సెర్బియా లెజెండ్ నొవాక్ జొకోవిచ్ ఆశిస్తుండగా.. కార్లోస్ అల్కరాజ్, జానిక్ సినర్ వంటి ఈ తరం స్టార్ ఆటగాళ్లు తమ సత్తా నిరూపించుకోవాలని చూస్తున్నారు. 2023లో టైటిల్ నెగ్గి గతేడాది సెమీఫైనల్లో జానిక్ సినర్ చేతిలో ఓడిన నొవాక్ ఈసారి టైటిల్ నెగ్గాలని చూస్తున్నాడు. తొలి రౌండ్‌లో అతను ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు చెందిన తెలుగు కుటుంబంలో పుట్టి అమెరికాకు ఆడుతున్న బసవారెడ్డి నిశేష్ రెడ్డితో తలపడనున్నాడు.
డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ జానిక్ సినర్ (ఇటలీ) మరో టైటిల్‌పై గురి పెట్టగా.. రఫెల్ నడాల్ బాటలో నడుస్తున్న స్పెయిన్ యువ కెరటం కార్లోస్ అల్కరాజ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా నెగ్గి కెరీర్ స్లామ్ పూర్తి చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. ఇండియా నుంచి సింగిల్స్‌లో సుమిత్ నగాల్ తొలి రౌండ్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన 26వ సీడ్ టొమాస్ మచాక్‌తో పోటీపడనున్నాడు. విమెన్స్ సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అరీనా సబలెంకతో పాటు ఇగా స్వైటెక్, కొకో గాఫ్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన బొలిపల్లి రిత్విక్ చౌదరి తొలిసారి గ్రాండ్ స్లామ్ టోర్నీలో పోటీపడుతున్నాడు. అమెరికా ప్లేయర్ ర్యాన్ సెగెర్మన్‌తో కలిసి మెన్స్ డబుల్స్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. డబుల్స్‌లో రోహన్ బోపన్న, శ్రీరామ్ బాలాజీ, యూకీ భాంబ్రీ కూడా తమ పార్ట్‌నర్స్‌తో పోటీలో నిలిచారు.