ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ డ్రా విడుదలైంది. భారత స్టార్ ఆటగాడు సుమిత్ నాగల్ కు తొలి రౌండ్ లోనే కఠిన సవాలు ఏర్పడింది. సుమిత్ మొదటి రౌండ్‌లో ప్రపంచ నం.25 టోమస్ మచాక్‌తో తలపడనున్నాడు. తొలి రౌండ్ లు గెలిస్తే 24 గ్రాండ్ స్లామ్స్ టైటిల్స్ విజేత జొకోవిచ్ తో తలపడే అవకాశం ఉంది. 27 ఏళ్ల నాగల్ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 98వ స్థానంతో మెయిన్‌డ్రాలో నేరుగా ప్రవేశించాడు. 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నాగల్ రెండో రౌండ్ కు చేరుకున్నాడు.
డిఫెండింగ్ ఛాంపియన్ ప్రపంచ నం.1 జానిక్ సిన్నర్ మొదటి రౌండ్‌లో నికోలస్ జార్రీతో తలపడనున్నాడు. జొకోవిచ్, అల్కరాజ్ ఒకే డ్రా లో ఉండడంతో స్థాయికి తగ్గట్టు ఆడితే సిన్నర్ ఫైనల్ కు చేరుకోవచ్చు. చారిత్రాత్మక 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం నొవాక్ జొకోవిచ్.. కెరీర్ గ్రాండ్‌స్లామ్‌ను పూర్తి చేయాలనే ఆశతో కార్లోస్ అల్కరాజ్ టైటిల్ గెలవాలనే లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. వీరిద్దరూ తొలి నాలుగు రౌండ్ లు దాటితే బ్లాక్‌బస్టర్ క్వార్టర్ ఫైనల్ పోరును వీరిద్దరి మధ్య చూడొచ్చు.
మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ అరీనా సబలెంకా వరుసగా మూడో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గాలని ఆరాటపడుతుంది. తొలి రౌండ్‌లో ఆమె 2017 యూఎస్ ఓపెన్ ఛాంపియన్ స్లోన్ స్టీఫెన్స్‌తో తలపడనుంది. సెమీ-ఫైనల్‌లో ప్రపంచ నం.3 కోకో గౌఫ్‌తో సబాలెంకా కఠినమైన పరీక్ష ఎదురు కానుంది. ఐదు సార్లు గ్రాండ్ స్లామ్ విజేత ఇగా స్విటెక్ కాటెరినా సినియాకోవాతో ప్రారంభ రౌండ్‌లో తలపడుతుంది.