మెల్‌బోర్న్: సెర్బియా సూపర్ స్టార్ నొవాక్ జొకోవిచ్, స్పెయిన్ యంగ్‌స్టర్ కార్లోస్ అల్కరాజ్.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆదివారం జరిగిన మెన్స్ ప్రిక్వార్టర్స్‌లో ఏడోసీడ్ జొకోవిచ్ 6–3, 6–4, 7–6 (7/4)తో జిరి లెహెకా (చెక్)పై గెలవగా, మూడోసీడ్ అల్కరాజ్‌తో జరిగిన మ్యాచ్ (7–5, 6–1, 0–0) మధ్యలో జాక్ డార్పర్ నడుం నొప్పితో రిటైర్ అయ్యాడు. దాంతో వాకోవర్‌తో ముందుకొచ్చిన అల్కరాజ్ తొలిసారి నొవాక్‌తో క్వార్టర్స్‌తో పోటీకి రెడీ అయ్యాడు. ఈ ఇద్దరిలో ఎవరు ముందుకు వెళ్తారన్న ఉత్కంఠ మొదలైంది. ఇతర మ్యాచ్‌ల్లో జ్వెరెవ్ (జర్మనీ) 6–1, 2–6, 6–3, 6–2తో హంబర్ట్ (ఫ్రాన్స్)పై, టొమ్మీ పాల్ (అమెరికా) 6–1, 6–1, 6–1తో ఫోకినా (స్పెయిన్)పై గెలిచి ముందంజ వేశారు.
ఎదురులేని సబలెంకా
విమెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో టాప్‌సీడ్ అరీనా సబలెంకా (బెలారస్) 6–1, 6–2తో ఆండ్రీవా (రష్యా)పై నెగ్గి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. ఇతర మ్యాచ్‌ల్లో కోకో గాఫ్ (అమెరికా) 5–7, 6–2, 6–1తో బెలిందా బెన్సిచ్ (స్విట్జర్లాండ్)పై, బడోసా (స్పెయిన్) 6–1, 7–6 (7/2)తో డానిలోవిచ్ (సెర్బియా)పై, పావ్లుచెంకోవా (రష్యా) 7–6 (7/0), 6–0తో డొనా వెకిచ్ (క్రొయేషియా)పై గెలిచారు.
మిక్స్‌డ్ క్వార్టర్స్‌లో బోపన్న జోడీ
ఇండియా వెటరన్ ప్లేయర్ రోహన్ బోపన్న–జాంగ్ షుయ్ (చైనా) జోడీ మిక్స్‌డ్ డబుల్స్‌లో క్వార్టర్‌ఫైనల్లోకి అడుగుపెట్టింది. ప్రిక్వార్టర్స్‌లో నాలుగోసీడ్ టేలర్ టౌన్సెండ్ (అమెరికా)–హుగో ఎన్స్ (మొనాకో) మ్యాచ్ నుంచి వైదొలగడంతో బోపన్న-–షుయ్‌కు వాకోవర్ విజయం లభించింది.