- జొకోవిచ్, అల్కరాజ్, జ్వెరెవ్, గాఫ్ కూడా..
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో స్టార్ టెన్నిస్ ప్లేయర్లందరూ అంచనాలను అందుకున్నారు. శుక్రవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ మూడో రౌండ్‌లో టాప్‌సీడ్ అరీనా సబలెంకా (బెలారస్) 7–6 (7/5), 6–4తో క్లారా టౌసన్ (డెన్మార్క్)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. 2 గంటల 6 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్‌లో మాత్రమే సబలెంకాకు పోటీ ఎదురైంది. అయితే బలమైన సర్వీస్‌లు, ఫోర్‌హ్యాండ్ షాట్లతో టౌసన్‌ను కట్టడి చేసింది. తన సర్వీస్‌ల్లో 72 శాతం పాయింట్లు రాబట్టిన సబలెంకా ఒక్క ఏస్ కూడా కొట్టలేదు.
ఇక మూడు ఏస్‌లు, ఆరు డబుల్ ఫాల్ట్స్ చేసిన టౌసన్ 33 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. 9 బ్రేక్ పాయింట్లలో ఐదింటిని మాత్రమే కాచుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో మూడోసీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–4, 6–2తో లైలా ఫెర్నాండేజ్(కెనడా)పై, డొనా వెకిచ్ (క్రొయేషియా) 7–6 (7/4), 6–7 (3/7), 7–5తో డయానా ష్నైడర్ (రష్యా)పై, అనస్తాసియా పావ్లుచెంకోవా (రష్యా) 6–1, 6–2తో లారా సెగ్మండ్ (జర్మనీ)పై, డానిలోవిచ్ (సెర్బియా) 7–6 (7/3), 6–1తో పెగులా (అమెరికా)పై, బడోసా (స్పెయిన్) 6–4, 4–6, 6–3తో మార్టా కోస్తుక్ (ఉక్రెయిన్)పై గెలిచి తర్వాతి రౌండ్‌లోకి అడుగుపెట్టారు. జపాన్ ప్లేయర్ నవోమి ఒసాకా కడుపు కండరాల నొప్పితో మ్యాచ్ మధ్యలోనే వైదొలిగింది. దీంతో బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్)కు వాకోవర్ విజయం లభించింది.
జొకోవిచ్ జోరుగా..
25వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్న సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రిక్వార్టర్స్ చేరాడు. మూడో రౌండ్‌లో జొకో 6–1, 6–4. 6–4తో థామస్ మాచక్ (చెక్)ను ఓడించాడు. 2 గంటలా 22 నిమిషాల మ్యాచ్‌లో జొకో తన ట్రేడ్ మార్క్ ఆటతో ఆకట్టుకున్నాడు. 9 ఏస్‌లు కొట్టిన జొకో 28 విన్నర్లు, 5 బ్రేక్ పాయింట్లతో ఈజీగా ప్రత్యర్థికి చెక్ పెట్టాడు. ఇతర మ్యాచ్‌ల్లో మూడోసీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) 6–2, 6–4, 6–3 (3/7), 6–2తో బోర్జెస్ (పోర్చుగల్)పై, రెండోసీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–3, 6-–4, 6–4తో ఫియాన్లీ (బ్రిటన్)పై గెలి ప్రిక్వార్టర్స్ చేరారు.
జాక్ డార్పర్ (బ్రిటన్) 6–4, 2–6, 5–7, 7–6 (7/5), 7–6 (10/8)తో అలెగ్జాండర్ ఉకిచ్ (ఆస్ట్రేలియా)పై నెగ్గగా... టామీ పాల్ (అమెరికా) 7–6 (7/0), 6–2, 6–0తో కార్బాలెస్ బియానా (స్పెయిన్)పై, హంబర్ట్ (ఫ్రాన్స్) 4–6, 7–5, 6–4, 1–0తో ఫిల్స్ (ఫ్రాన్స్)పై గెలిచి మెగా టోర్నీలో ముందంజ వేశారు. ఇక మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో ఇండియా స్టార్ రోహన్ బోపన్న–షువై జాంగ్ (చైనా) 6–4, 6–4తో క్రిస్టినా మల్డెనోవిచ్ (ఫ్రాన్స్)–ఇవాన్ డుడిగ్ (క్రొయేషియా)పై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.