
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియాకు ఓడించాలంటే ప్రస్తుతం అన్ని జట్లకు అతి పెద్ద సవాలు. పైగా దుబాయ్ లో అన్ని మ్యాచ్ లు ఆడడం రోహిత్ సేనకు అనుకూలంగా మారింది. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని టీమిండియా టైటిల్ ఫేవరేట్ అని క్రికెట్ ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. ఎలా చూసుకున్నా భారత్ టైటిల్ గెలవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ జాసన్ గిల్లెస్పీ తమ జట్టును తెగ హైలెట్ చేసుకుంటున్నాడు.
ఆస్ట్రేలియాను ఓడించాలంటే ఇండియాకు భయమని సంచలన కామెంట్స్ చేశాడు. గిలెస్పీ మాట్లాడుతూ.. " దుబాయ్‌లో మాత్రమే మ్యాచ్ లు ఆడడం భారత్ కు కలిసి వస్తుంది. అక్కడ వికెట్, పరిస్థితుల గురించి వారికి బాగా తెలుసు. భారత్ కు ఇది ఖచ్చితంగా అనుకూలంగా మారనుంది. అయితే ఆస్ట్రేలియాకు ఇండియా భయపడుతుంది. భారత్‌ను ఓడించడం కష్టం. కానీ ఆస్ట్రేలియా అంటే ఇండియాకు భయం. కీలకమైన మ్యాచ్‌లలో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాను ఓడించాలంటే అదొక పెద్ద సవాల్". అని ఈ ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ టీమిండియాకు హెచ్చరికలు పంపాడు.
ఐసీసీ ఈవెంట్స్ లో భారత్ పై ఆస్ట్రేలియాకు స్పష్టమైన ఆధిక్యం ఉంది. భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియాను ఆస్ట్రేలియా ఓడించింది. స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, గ్లెన్ మాక్స్వెల్ వంటి ఆటగాళ్లకు దుబాయ్‌లో భారత బౌలింగ్ దళాన్ని ఎదర్కోగలరు. పాట్ కమ్మిన్స్, స్టార్క్,హేజిల్‌వుడ్ లేకపోయినా ఆ జట్టు బౌలింగ్ డీసెంట్ గా ఉంది. మరోవైపు భారత్ సైతం పటిష్టంగా కనిపిస్తుంది. ఆస్ట్రేలియా, భారత్ జట్లు ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో తలపడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రెండు జట్లు సెమీస్ కు అర్హత సాధించాయి.