ముంబయి : భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా(Australia) ప్రధాని ఆంథోని అల్బనీస్ (Anthony Albanese) ఐఎన్‌ఎస్ విక్రాంత్ (INS Vikrant)ను సందర్శించారు. ఈ సందర్భంగా భారత నావికాదళ (Indian Navy) సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. నౌకపై ఉన్న యుద్ధ విమానంలో కాసేపు కూర్చున్నారు. ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను సందర్శించిన తొలి విదేశీ ప్రధాని అల్బనీస్ కావడం విశేషం. ఐఎన్‌ఎస్ విక్రాంత్... భారత మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) ప్రత్యేక ఆహ్వానం మేరకు ఐఎన్‌ఎస్ విక్రాంత్ సందర్శనకు వచ్చానట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ తెలిపారు. ఇక్కడకు రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఇండో -పసిఫిక్ ప్రాంతంలో భారత్‌ను ప్రధాన కేంద్రంగా ఉంచాలనే ఆస్ట్రేలియా ప్రభుత్వ విధానానికి తన పర్యటన నిదర్శనం అని చెప్పారు. ముందుచూపుతో రెండు దేశాల మధ్య సైనిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని మోడీ చాలా కృషి చేస్తున్నారని అల్బనీస్ చెప్పారు.
ఈ ఏడాది తర్వాత మలబార్ నౌకాదళ విన్యాసాలకు (Malabar Naval Exercise) ఆస్ట్రేలియా నాయకత్వం వహిస్తుందని ఆంథోని అల్బనీస్ ప్రకటించారు. భారత్ తొలిసారి ఆస్ట్రేలియా- అమెరికా సంయుక్తంగా నిర్వహించే టాలిస్మాన్ విన్యాసాల్లో (Talisman Sabre Exercise) పాల్గొననుంది. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో భారత్- ఆస్ట్రేలియా వ్యూహాత్మక భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఈ ప్రాంతంలో చైనా (China) దూకుడుకు కళ్లెం వేసేందుకు భారత్, అమెరికా, జపాన్‌లు సంయుక్తంగా చేపడుతున్న మలబార్ విన్యాసాల్లో 2020 నుంచి ఆస్ట్రేలియా కూడా పాల్గొంటుంది. అంతకుముందు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్, భారత ప్రధాని నరేంద్ర మోదీ బోర్డర్ - గావస్కర్ (Border-Gavaskar series) సిరీస్‌లో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌ను కాసేపు వీక్షించారు.